ఎంజీఎంలో ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతిన్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి శిశువును అత్యవసర విభాగానికి తీసుకువెళ్లారు.
అయితే, అప్పటికే కుక్కలు నడుము కింది భాగం తినడంతో చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. బతికి ఉన్న శిశువును తీసుకు వచ్చి తిన్నాయా? లేక చనిపోయిన శిశువును తీసుకువచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది.
అత్యవసర విభాగానికి కొద్ది దూరంలోనే పిల్లల వార్డు కూడా ఉండడంతో అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరిగాయి.
శిశువు మృతదేహమును ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. ఘటనపై ఎంజీఎం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, తమ హాస్పిటల్కు సంబంధించిన శిశువు కాదని, కుక్కలు బయటి నుంచి తీసుకువచ్చి ఉండవచ్చని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు..