ప్రభుత్వ ఆసుపత్రిలో డేట్ అయిపోయిన సెలైన్ బాటిల్స్
ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. రోగుల పాలిట శాపంగా మారుతోంది. కాలం చెల్లిన మందులు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లను ఇష్టానుసారం వినియోగిస్తుండడo తో రోగుల ప్రాణం మీదకు వస్తోంది.
తాజాగా నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. కడెం మండలం లింగాపూర్‌కు చెందిన అజారుద్దీన్ జ్వరంతో బాధపడుతూ ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా..
పరీక్షించిన వైద్యులు అతడికి సెలైన్ బాటిల్‌ను ఎక్కించాలని సిబ్బందికి సూచించారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న ఓ బాటిల్‌ను తీసుకొచ్చిన సిబ్బంది.. అతడికి ఎక్కించడం ప్రారంభించారు.
కానీ, కాసేపటికే అజారుద్దీన్ మరింత అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన అతడి సోదరుడు ఆ బాటిల్‌ను పరిశీలించగా.. 2024 మార్చి నెల వరకే దాని కాలపరిమితి ఉన్నట్లు కనిపించింది.
ఈ విషయాన్ని వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. దాన్ని తొలగించి మరొకటి పెట్టారు. ఈ ఘటనలో బాధిత యువకుడికి ఎటువంటి అపాయం కలగకపోయినా.. కొంత మేర అస్వస్థతకు గురయ్యాడు.
దీంతో సిబ్బందిపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం బయటకు పొక్కడంతో పలువురు విలేకరులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి టేబుల్‌ను పరిశీలించగా… కాలం చెల్లిన మరిన్ని ఇంజక్షన్లు దర్శనమిచ్చాయి.
వాస్తవానికి నిర్ణీత గడువుకు మూడు నెలల ముందే ఆయా మందులను ప్రత్యేకంగా ఒక బాక్స్‌లో వేసి, నెల రోజుల ముందు వరకు మాత్రమే ఉపయోగిస్తారు.
కానీ, ఖానాపూర్ ఆస్పత్రిలో అలాంటి నిబంధనలేమీ పాటిస్తున్న దాఖలాలు కనిపించలేదు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ వంశీమాధవ్‌ను విలేకరులు వివరణ కోరగా కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచిస్తామని చెప్పారు.
పని భారం వల్ల మందులను తొలగించడంలో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి ఉన్నతాధికారులకు వివరాలు అందజేస్తామన్నారు.
గడువు ముగిసిన సెలైన్ బాటిల్ ఎక్కించిన అజారుద్దీన్‌కు ఎటువంటి ఇబ్బందీ లేదని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు