రైతులకు ఒకేసారి 15 వేలు రైతు భరోసా..
రానున్న యాసంగి సీజన్లోనే ఖరీఫ్, రబీకి కలిపి పెట్టుబడి సాయాన్ని “రైతు భరోసా” పథకం కింద అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాస్త ఆలస్యమైనా పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందించి అర్హులకే ఈ పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేస్తున్నారు. వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా కార్యక్రమం అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అక్షరాల నిజం చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా రైతు భరోసా పథక అమలుచేస్తామని తెలిపింది.
ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని “రైతు బంధు”పేరుతో అమలుచేసింది.
భూమి పట్టా కలిగిన వారం దరికి ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖరీఫ్, యాసంగి పంట కాలాలకు కలిపి రూ.10 వేల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఇందులో కౌలు రైతులకు ఎలాంటి సాయాన్ని అందజేయ లేదు. ఈ పథకం అమలు చేసేందుకు అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అనుసంధానం చేసుకుని నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది.
సాగులో ఉన్న, సాగులో లేని భూములు, రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా మార్పిడి చేయకుండా వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధివిధానాలు రూపొందించకుండానే అప్పటి ప్రభుత్వం భూమి పట్టా కలిగిన ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. అర్హులైన రైతులకే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేలా మార్గదర్శకాలను పకడ్బందీగా రూపొందించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం మార్గదర్శకాలను రైతు భరోసా పథకానికి వర్తింపచేయాలని యోచిస్తోంది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని అందుకోవాలని యాసంగి సీజన్ ఆరంభం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి…