మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్న గ్రామస్తులు…
తమకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టెయిల్‌పాండ్ నిర్వాసితులు, గ్రామస్థులు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాన్వాయ్‌ని ఆదివారం అడ్డుకున్నారు.
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న దున్నపోతుల గండి లిఫ్ట్ పనులను పరిశీలించడానికి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌పాటి, ఎన్నెస్పీ చీఫ్ ఇంజినీర్ అనిల్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కాన్వాయ్‌ని వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారిని తప్పించే ప్రయత్నం చేయగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమకు తాగునీరు రావడం లేదని, ఇండ్లల్లోకి పాములు, తేళ్లు వస్తున్నాయని నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు.
సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.