లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన ఏఈ
బిల్లులపై సంతకం చేయడానికి రూ.6 వేలు లంచం తీసుకుంటూ నీటిపారుదలశాఖ ప్రత్యేక సహాయక ఇంజినీరు(ఏఈ) అనిశాకు చిక్కారు.
అనిశా వరంగల్ రేంజి డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంటతండా పంచాయతీ ప్రత్యేకాధికారిగా నీటిపారుదలశాఖ ఏఈ గుగులోత్ గోపాల్ పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు బానోత్ యాకుబ్ పంచాయతీ పరిధిలో రూ.1.27 లక్షల విలువ చేసే పనులను పూర్తి చేసి బిల్లులను గ్రామ కార్యదర్శికి సమర్పించారు. ఆయన వాటిని పరిశీలించి, నిర్ధారించారు.
ఈ బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేకాధికారి కౌంటర్ సంతకం కావాల్సి రావడంతో గోపాల్ను సంప్రదించారు. రూ.6 వేలు ఇస్తేనే సంతకం చేస్తానని ఆయన చెప్పడంతో యాకుబ్ అనిశా అధికారులను సంప్రదించారు.
దీంతో నిఘా ఉంచిన అధికారులు సోమవారం హనుమకొండ నక్కలగుట్ట వద్ద యాకుబ్ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా గోపాల్ను పట్టుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.