శభాష్ పోలీస్ అన్న... ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు!! ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు కాపాడారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గంట వ్యవధిలో కేసును చేధించారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ (28) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్‌ …

శభాష్ పోలీస్ అన్న...

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని రక్షించిన పోలీసులు!!

ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని కొన్ని గంటల్లోనే పోలీసులు కాపాడారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గంట వ్యవధిలో కేసును చేధించారు.

ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీరప్ప నగర్‌కు చెందిన మాలంపాక బాబీ (28) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటకు వచ్చాడు.

అనంతరం తన బావమరిదికి ఫోన్‌ చేశాడు. తాను చనిపోతున్నానంటూ చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. కుటుంబసభ్యులు ఆయనకు తెలిసిన వారిని సంప్రదించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్‌.. బాబీ మొబైల్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి ఏరియాలో ఉన్నట్లు గుర్తించి వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించారు.

ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా అప్పటికే బాబీ దోమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గమనించారు.

ఆ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సహకారంతో నిండు ప్రాణం కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.

Updated On 14 Aug 2024 10:07 AM IST
cknews1122

cknews1122

Next Story