డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లపై ఎఫ్‌ఐఆర్…
షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది.
సస్పెన్షన్‌లో ఉన్న షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలు మల్కాపురం సునీత ఈ నెల 11న ఫిర్యాదు చేయగా అదే రోజు కేసు రిజిస్టర్ అయింది.
”షాద్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత రోజువారీ కూలీ. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. జులై 30వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో షాద్‌నగర్ డీఐ రామిరెడ్డి, నలుగురు పోలీసులు సునీత, ఆమె భర్త భీమయ్యలను స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నాగేందర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీకి సంబంధించి విచారించేందుకని తీసుకెళ్లిన పోలీసులు తొలుత భీమయ్యను కొట్టారు. తర్వాత సునీతకు భర్త నిక్కరు తొడిగి లాఠీతో కొట్టారు.
ఇద్దరు పోలీసులు తొడభాగంపై కాళ్లతో తొక్కుతుండగా ఛాతీభాగంలో రబ్బరుతో కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్రోలు పోసి తగలబెడతామని బెదిరించారు. రాత్రి 2 గంటల వరకూ స్పృహ తప్పేలా హింసించారు. సునీత కుమారుడు జగదీశ్వర్‌నూ కొట్టారు.
ఆ తర్వాత ఫిర్యాదుదారు నాగేందర్ కారులోనే ఇంటికి పంపించారు” అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిరుపేదనైన కారణంగా తీవ్రంగా కొట్టిన డీఐ రామిరెడ్డి ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
‘కేసు సీబీఐకి అప్పగించాలి’
షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో సునీతపై దాడి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది, సమతా సైనిక్‌దళ్ న్యాయ సలహాదారు డాక్టర్ బి.కార్తీక్ నవయన్ గురువారం ఫిర్యాదు చేశారు.
సునీతపై దాడికి పాల్పడిన డీఐ రామిరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించాలని, అరెస్టు చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు. కేసు సీబీఐకి అప్పగించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద బాధితురాలికి పరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.