టీపీసీసీ చీఫ్ రేసులో కొత్త ట్విస్ట్……!!!
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక అనూహ్య మలుపులు తిరుగుతోంది.
ఇప్పటికే రేవంత్ వారసుడు ఎవరనే విషయంపై కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం మళ్లీ మొదటికి వచ్చినట్లు కనబడుతోంది.
గత నెలలోనే మహేష్ కుమార్ గౌడ్ , బలరాం నాయక్ లలో ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించేందుకు సిద్దమైనా..
మరోసారి రేవంత్ రెడ్డితో చర్చించి పీసీసీ ప్రెసిడెంట్ పేరును అధికారికంగా ప్రకటించాలని వాయిదా వేశారు.
ఆ తర్వాత ఆషాడమాసం అడ్డురావడం, రేవంత్ విదేశీ పర్యటనతో పీసీసీ కొత్త అధ్యక్షుడి ప్రకటనకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.
ఈ క్రమంలోనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
బీసీ, ఎస్టీలకు కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది..? అని సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికీ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పై ఆ సామాజిక వర్గం కొంత ఆగ్రహంతో ఉంది.
ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడంతో దీనిని బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఎస్సీ వర్గీకరణ వివాదానికి బీజేపీ హయాంలో ముగింపు లభించిందని కమలనాథులు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు.
దీంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు పార్టీ అధ్యక్షుడిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుంది..? అని కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రేవంత్ తాజాగా ఢిల్లీకి వెళ్ళడంతో అధిష్టాన పెద్దలతో సమావేశం కానుండటంతో పీసీసీపై ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చునని తెలుస్తోంది.