మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కారు.. చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
సికె న్యూస్ ప్రతినిది
అది రద్దీగా ఉండే విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి.శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 12.30 గంటలు కావొస్తున్నది. పంతంగి టోల్‌గేట్ వైపు నుంచి మితిమీరిన వేగంతో కారు దూసుకొస్తున్నది.
అప్పటికే వచ్చిన సమాచారంతో హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీసులు.. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సహకారంతో మండలకేంద్రంలోని రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
బారికేడ్లను చూసి హైవేపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలోకి రాంగ్‌రూట్‌లోకి కారును పోనిచ్చారు. ఇంకేముంది.. మళ్లీ చేజ్.. ఆ ముందుకురాగానే కారును హైవేకు ఆనుకుని ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ వైపు మళ్లించారు. పోలీసు వాహనాలు ఆ కారును వెంబడించాయి.
చివరకు తప్పించుకునే క్రమంలో కారు వేగంగా స్తంభాన్ని ఢీకొట్టింది.. అందులోని నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.. ఇదంతా క్రైమ్ సిరీస్‌లలోని ఎపిసోడ్‌లా జరిగిపోయింది. తేరుకునేలోపే మళ్లీ పోలీసు వాహనాలన్నీ వెళ్లిపోయాయి..
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఖమ్మ, భద్రాచలం ప్రాంతాల నుంచి నలుగురు నిందితులు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో నల్లగొండ టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో నిందితులను వెంబడించారు.
విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌గేట్ దగ్గర ఎర్టిగా కారులో వస్తున్న నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, నిందితులు టోల్‌గేట్ దగ్గర వాహనాన్ని ఆపకుండా, గేట్‌ను ఢీకొట్టి తప్పించుకున్నారు. అధికారులు వెంటనే హయత్‌నగర్ ఎక్సైజ్‌తోపాటు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు సమాచారం అందించారు.
వారు అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో హైవేకు అడ్డుగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే, బారికేడ్లను గుర్తించిన నిందితులు కారును రాంగ్‌రూట్‌లోకి మళ్లించారు.
హైవేపై దాదాపు 500 మీటర్లు రాంగ్ రూట్‌లో వెళ్లి ఆ తర్వాత జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ వైపు మళ్లారు. అటునుంచి బయటకు వెళ్లిపోవొచ్చని భావించారు. కానీ, కాలనీకి ప్రవేశమార్గం, తిరిగి వెళ్లేమార్గం ఒకటేననే విషయం వారికి తెలియదు.
కారు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో కాలనీలోకి వీధుల్లో చక్కర్లు కొట్టింది. కాలనీ వాసులు కొద్దిసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటికే కాలనీ ప్రవేశమార్గం వద్ద పోలీసులు తమ వాహనాలతో మోహరించారు. అతివేగంలో కారును వెనక్కి తిప్పే క్రమంలో నిందితులు స్తంభాన్ని ఢీకొట్టారు.
జాతీయరహదారిపై మొబైల్ వెహికిల్ కానిస్టేబుల్ వారిని పట్టుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. ఆ వెంటనే పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కారులోని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నల్లగొండ జిల్లాకు తరలించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.