బాలికకు అండగా నిలిచిన సీఎం రేవంత్..!!
తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాటన..
అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ
హైదరాబాద్, ఆగస్టు 19: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అప్పటి వరకు తల్లిచాటు బిడ్డగా ఎదిగిన ఆ చిన్నారికి ఒక్కసారిగా లోకం చీకటిగా మారిపోయింది.
ఉన్న ఒక్క బంధం కూడా తెగిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది 11 ఏళ్ల బాలిక. కన్న తల్లి చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ‘‘నేనున్నానంటూ’’ బాసటగా నిలిచారు.
బాలికకు అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది.
విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ అభినవ్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం రేవంత్ ఆదేశాల మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్యం, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు..