డిప్యూటీ కలెక్టర్ పై లాఠీచార్జి?
హైదరాబాద్:ఆగస్టు 21
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్ బంద్‌కు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసన చేపట్టారు.
అయితే ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఒక పోలీస్ పొరపాటున జిల్లా డిప్యూటీ కలెక్టర్‌పై లాఠీచార్జ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్ రాజధాని పాట్నాలో ఈ సంఘటన జరిగింది.
జాతీయ రహదారులపై బైఠాయించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
ఇటీవలే సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో ఏర్పాటైన ఏడుమంది సభ్యుల ధర్మాసనం ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో మరింత వెనుకబడిన వారికి ప్రత్యేక కోటాలను మంజూరు చేయొచ్చంటూ పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని స్పష్టం చేసింది. కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై 2004లో అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.
దీన్ని నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాష్ట్రాలు ముందుకు వెళ్లకూడదని డిమాండ్ చేస్తోన్నారు. రిజర్వేషన్లల్లో ఇప్పుడు ఉన్న కోటాను యథాతథంగా కొనసాగించాలని, ఇందులో ఎలాంటి మార్పులూ చేయకూడదని పట్టుబట్టారు.
ఉత్తరాది రాష్ట్రాలపై బంద్ ప్రభావం కనిపించింది. బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. వంటి రాష్ట్రాల్లో ఆందోళనకారులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. రోడ్లపై బైఠాయించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేశారు.
బిహార్‌లోని జెహనాబాద్‌లో ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. ఫలితంగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి.
వారిని నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి నాయకులు, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు.
ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో వాళ్లు వాగ్వివాదానికి దిగారు. అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. ఈ బంద్‌కు భీమ్ సేన్ ఆర్మీ, జైభీమ్ సంఘాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి.. తన సంఘీభావాన్ని తెలియజేశారు.
భారత్ బంద్ సందర్భంగా పాట్నాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తోన్న సందర్భంగా గందరగోళం ఏర్పడింది. నిరసనకారులను అదుపు చేస్తోన్న పాట్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఐఎఎస్ అధికారి శ్రీకాంత్ కుండ్లిక్ ఖండేకర్‌పై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు.
నిరసనకారులతో ఆయన కూడా ఈ బంద్‌లో పాల్గొన్నట్లు భావించిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. లాఠీతో ఆయన వీపు వాయగొట్టారు. దీనితో ఉలిక్కిపడ్డ శ్రీకాంత్ కుండ్లిక్.. ఆ కానిస్టేబుల్‌కు చీవాట్లు పెట్టారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు శ్రీకాంత్‌కు సర్దిచెప్పారు. ఆ కానిస్టేబుల్‌తో క్షమాపణ చెప్పించారు.