మరణంలోను విడిపోని కవలలు…
జన్మించినప్పుడు ఇద్దరూ కలిసే భూమ్మీదకు వచ్చారు. మృత్యువులోనూ కలిసే ఈ లోకం వీడిపోయారు.ఇద్దరి లక్ష్యమూ పోలీసు కొలువు సాధించటమే. సాధనలో భాగంగా ఒకేచోట శిక్షణ తీసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాద రూపంలో విధి వెక్కిరించటంతో కన్నవారి ఆశల్నీ అడియాశలు చేస్తూ మృత్యుఒడికి చేరారు. ఖమ్మం గ్రామీణ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కవల సోదరులు మృతిచెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మం నగర పరిధిలోని దానవాయిగూడెం కాలనీకి చెందిన అత్తులూరి నరసింహారావు, రమ దంపతులకు కవలలు నవీన్ (22), మహేశ్ (22) సంతానం. దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
యువకులిద్దరూ డిగ్రీ పూర్తిచేసి పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. ఖమ్మంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌కు చెందిన పవన్ అనే స్నేహితుడితో కలిసి మంగళవారం అన్నదమ్ములు తమ బైక్‌పై కూసుమంచి మండలంలోని బంధువుల ఇంటికి బయలుదేరారు.
మార్గమధ్యలో మద్దులపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో వీరి బైక్‌ను ఢీకొనటంతో నవీన్, మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. పవన్‌కి తీవ్ర గాయాలయ్యాయి.
ఘటనాస్థలాన్ని సీఐ రాజు, ఎస్‌ఐ రామారావు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో పవన్ చికిత్స పొందుతున్నారు.