నాలాలో గల్లంతైన చిన్నారి మృతదేహం లభ్యం..
నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ నాలాలో పడి గల్లంతైన రెండేళ్ల చిన్నారి అనన్య ఎపిసోడ్ విషాదంగా ముగిసింది.
గల్లంతైన చిన్నారి ఆచూకీ కోసం అధికార యంత్రాంగం, డిజాస్టర్ టీం చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. చిన్నారి మృతదేహం గురువారం ఉదయం శివారు ప్రాంతంలో లభ్యమైంది. వర్ని రోడ్డులోని ఆనంద్నగర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్న విషయం విదితమే.
నాలలో గల్లంతైన తమ చిన్నారి క్షేమంగా దొరుకుతుందనే ఆశతో ఉన్న తల్లిదండ్రులకు బురదలో కూరుకుపోయి పడి ఉన్న పాప మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి రోదనలు అందరి చేత కన్నీళ్లు పెట్టించాయి. చిన్నారి అనన్య నాలలో గల్లంతైన క్షణం నుంచి అధికార యంత్రాంగం అప్రమత్తమై పాపను సురక్షితంగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంది.
చివరకు నగర శివారు ప్రాంతంలో బురదలో కూరుకుపోయి పడి ఉన్న పాప మృతదేహాన్ని రిస్క్యూ టీం కనుగొంది. పాప కోసం రిస్క్ చేసిన టీం సభ్యులందరూ పాప క్షేమంగా దొరకాలని చాలా శ్రమించారు. చివరకు పాప మృతదేహాన్ని చేతుల్లోకి ఎత్తుకోవాల్సి వస్తుందని ఊహించలేదని రెస్క్యూ టీమ్ సభ్యులు కంటతడి పెట్టుకున్నారు.