MP రఘునందన్ రావు స్వగ్రామంలో కుల బహిష్కరణ…
అంత్యక్రియలు రాని కులస్తులు…
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్లో కుల బహిష్కరణ జరిగింది.
భూ తగాదాల్లో నెలకొన్న వివాదంతో బండమీది సాయిలు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయగా, ఆయన బుధవారం మరణించడంతో కులస్తులు అంత్యక్రియలు రాని పరిస్థితి ఉంది.
గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొప్పాపూర్ గ్రామంలో ఎస్సీ సామాజిక తరగతికి చెందిన బండమీది మల్లయ్య, సాయిలు అన్నదమ్ములు.
సాయిలు గతంలో నక్సలిజంలో చేరి బయటకు వచ్చారు. అనంతరం ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, సర్పంచ్గా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన ఆయన డిపాజిట్ కూడా దక్కించుకున్నట్టు సమాచారం. బండమీది మల్లయ్య భార్య బాలమణి బొప్పాపూర్ తాజా మాజీ సర్పంచ్.
మాదిగ కులస్తులైన వీరిద్దరికీ కుల సంఘం పెద్దలతో గత కొన్నేండ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయంలో కుల బహిష్కరణ గురైన వీరు మూడేండ్ల క్రితం కొంత మొత్తంలో జరిమానా చెల్లించి మళ్లీ కులంలో చేరారు.
అప్పటి నుంచి మల్లయ్య, సాయిలు కుటుంబ సభ్యులతో కులస్తులు పట్టీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజా మాజీ సర్పంచ్ బావ అయిన బండమీది సాయిలు మంగళవారం మరణించారు.
అంత్యక్రియల కోసం కుల పెద్దలను రావాలని కోరగా అందుకు వారు నిరాకరించారు. బుధవారం ఉదయం అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి డప్పు కొట్టేందుకు రావాలని కోరినా.. కులస్తులు రాలేదు.
సాయిలు అంత్యక్రియలకు వెళ్లిన కులస్తులకు రూ.5000 జరిమానా విధిస్తామని కుల పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టు సాయిలు కుటుంబీకులు చెప్తున్నారు. పోలీసులు కుల పెద్దలను సంప్రదించి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
దాంతో చేసేదేమీ లేక పక్క గ్రామం నుంచి డప్పు కొట్టే వారిని రప్పించుకొని సాయిలు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పట్ల గ్రామస్తులు, దుబ్బాక నియోజకవర్గంలోని పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎంపీ ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.