లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన విద్యుత్తు శాఖ డీఈ
చేప చిక్కింది.. తిమింగలాలు తప్పించుకున్నాయ్
హైదరాబాద్: విద్యుత్తు సంస్థల్లో కొందరు ఇంజినీర్లు ప్రతి పనికి లంచం డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో డీఈ(టెక్నికల్) టి.రామ్మోహన్ లైన్లు మార్చేందుకు రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి గురువారం దొరికిపోయారు.
ఇదిగో ఉదాహరణ రూ.25వేలలో బిగించాల్సిన ప్యానల్ బోర్డుకు గుత్తేదారులు రూ.70వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సగం పంపకాలకే వెచ్చిస్తున్నారు.
చెల్లింపులుంటేనే..: విద్యుత్తు సంస్థల్లో వినియోగదారుడు దరఖాస్తు చేసుకుంటే నిర్ధారిత సొమ్ము లు చెల్లిస్తే అందించే సేవలు కొన్ని ఉంటాయి. వీటిని నేరుగా ఆన్‌లైన్‌లోనూ పొందొచ్చు. దళారీని ఆశ్రయించారంటే అదనంగా బాదేస్తారు. కొందరు కింది స్థాయి సిబ్బందే దళారుల పని చేస్తుంటారు.
ఏటొచ్చి గుత్తేదారులు చేసే పనుల్లోనే కింది నుంచి పైవరకు హోదాకు తగినట్టు లంచం తీసుకుంటున్నారు. స్తంభాలు, లైన్లు మార్చాలన్నా, ప్యానల్‌బోర్డులు ఏర్పాటు, అపార్ట్‌మెంట్లకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఛార్జ్ చేయడం, లేఅవుట్లకు లైన్లు వేయడం వరకు ఇలా ప్రతి పనిలో కమీుషన్లు అందుకుంటున్నారు.
నియంత్రణ శూన్యం: ఒక ఉద్యోగి తప్పుచేస్తే పైఅధికారికి ఫిర్యాదు చేస్తారు. అధికారి తప్పు చేస్తే..ఎవరూ ఎవరిపై చర్యలు తీసుకోవాలో విద్యుత్తు శాఖలో అంతుచిక్కదు. విజిలెన్స్ విచారణలు జరిగినా ఒక్కరిపైనా చర్యలు లేవు. లంచం అడిగితే ఏసీబీకి పట్టివ్వండి అని గతంలో పనిచేసిన సీఎండీ చెప్పడం గమనార్హం.
పెద్దలదీ అదే దారి: ఏసీబీ గాలానికి ప్రస్తుతం చేపనే చిక్కింది. సైబరాబాద్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో అవినీతి తిమింగళాలే ఉన్నాయి. ఏసీబీ వీరిపైన దృష్టి పెట్టినట్లు సమాచారం. గతంలో ఒక తిమింగలం చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే సీఎండీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. బదిలీల్లో వీరిపై వేటు వేయబోతున్నారు.
అనిశాకు చిక్కిన విద్యుత్తు శాఖ డీఈ
రామ్మోహన్
ఎల్బీనగర్: లంచం తీసుకుంటుండగా విద్యుత్తు శాఖ డీఈని అనిశా అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వివరాల ప్రకారం.. మంచాల మండలంలో ఓ వ్యక్తి 2 ఎకరాల లేఅవుట్‌లో 33కేవి, 11కేవి విద్యుత్తు స్తంభాలు ఉన్నాయి.
లేఅవుట్‌కు స్తంభాలు అడ్డొస్తున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్ అవసరం ఉందని ఓ గుత్తేదారును సంప్రదించాడు. అతను ఒప్పుకొని ఆన్‌లైన్‌లో స్తంభాల షిఫ్టింగ్, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేశాడు.
త్వరగా అనుమతులు ఇవ్వాలని గుత్తేదారు సరూర్‌నగర్ విద్యుత్తు కార్యాలయంలోని డివిజనల్ ఇంజినీర్ రామ్మోహన్‌ను కలవగా అతను రూ.18వేలు డిమాండ్ చేశాడు. దీంతో గుత్తేదారు ఏసీబీని ఆశ్రయించగా.. గురువారం అధికారి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.