రిజర్వేషన్లపై తెగని పంచాయతీ..!!
ఆశావహుల్లో ఆందోళన
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల పీటముడి వీడక ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.. ఓవైపు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఓటరు జాబితా రూపకల్పనలో ఉమ్మడి జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు..
మరోవైపు ఎన్నికల బరిలో దిగేవారు ఇప్పటికే తమ అనుచరులతో పావులు కదుపుతున్నారు.. మాజీలు సైతం తమ బలాన్ని నిలుపుకొనే దిశగా ప్రణాళికలు రచించుకుంటున్నారు.. రిజర్వేషన్ల అంశం తేలితేనే తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవచ్చని వారు భావిస్తున్నారు.
కొత్త విధానంపై సమాలోచనలు?
గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లు పదేళ్లపాటు అమలయ్యేలా చట్టం చేసింది. అయిదేళ్ల కిందట ఆ మేరకే ఎన్నికలు జరిగాయి. ఆ చట్టం ప్రకారం చూస్తే ప్రస్తుతం పాత రిజర్వేషన్లే అమలు కావాలి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కొత్త విధానం అమలు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాత రిజర్వేషన్లు రద్దు చేసి కొత్తవి ఎలా అమలు చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ అదే జరిగితే ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశముంది. మరోవైపు వార్డుల వారీగా ఓటర్లను విభజించి కుటుంబంలో ఓటు హక్కు కలిగిన వారందరినీ.. ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వినియోగించుకునే విధంగా జాబితా తయారు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,210 గ్రామ పంచాయతీల్లోని 11,132 వార్డుల పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెల 21న తుది జాబితా ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆశావహులు ఆందోళన పడుతున్నారు.