అనిశా వలలో విద్యుత్తు శాఖ డీఈ
వ్యవసాయ భూమిలో నుంచి వెళ్తున్న 33 కేవీ విద్యుత్తు లైన్‌ను మార్చేందుకు రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ విద్యుత్తు శాఖ డీఈ మాలోత్ హుస్సేన్ నాయక్ అనిశాకు పట్టుబడిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
అనిశా డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కుంభం ఎల్లయ్య అనే రైతుకు గ్రామ శివారులోని మోడల్ కాలనీలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి మధ్యలోంచి 33 కేవీ లైన్ వెళ్తుండటంతో ఇబ్బందిగా మారింది. అదే భూమిలో ఓ పక్కకు మార్చాలని విద్యుత్తు శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.
అధికారులు అంచనా వేసి రూ.16 లక్షలు అవుతాయని చెప్పగా.. రైతు డబ్బులను మూడు నెలల క్రితమే చెల్లించారు. సంబంధిత గుత్తేదారు భూమిలోంచి విద్యుత్తు స్తంభాలను పక్కకు వేసి వదిలేశారు. తీగలు అమర్చడానికి రైతు ఎల్లయ్య ఎల్‌సీ ఛార్జి రూ.2 లక్షల మేర చెల్లించారు.
అయినా పనులు ముందుకు సాగకపోవడంతో గుత్తేదారును నిలదీశాడు. దీంతో డీఈ పనులను నిలిపివేయించారని ఆయన చెప్పారు. రైతు డీఈ వద్దకు వచ్చి అడగ్గా పని పూర్తికావాలంటే తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో రైతు కుమారుడు కుంభం రాజు వరంగల్‌లోని అనిశా అధికారులను మూడు రోజుల క్రితం ఆశ్రయించాడు. శనివారం రాత్రి డీఈ హుస్సేన్ నాయక్‌కు రాజు రూ.20 వేలు ఇస్తుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు సట్ల రాజు, ఎల్ రాజు, శ్యాంసుందర్ సిబ్బంది పాల్గొన్నారు.