జాతీయ విపత్తుగా ప్రకటించండి….
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి…విపత్తు పరిశీలనకు రావాలని విన్నపం…
మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు…
పాడి పశువులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలక పెంపు
తక్షణ సహాయ చర్యలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు రూ.5 కోట్లు
ఎన్‌డీఆర్ఎఫ్ తరహాలో పోలీసు సిబ్బందికి శిక్షణ
భారీ వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం.. లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రాణ, పంట నష్టాలతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినందున స్వయంగా పరిశీలనకు రావాలని ప్రధానమంత్రిని కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు.
అతి తక్కువ సమయంలో ఇంత భారీ వర్షాలు కురవడానికి కారణాలు, ఈ రోజు, రేపటి పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారులను అడిగారు. ఊహించిన దానికన్నా ఎక్కవ వర్షాలు వచ్చాయని, గతంలో అయిదేళ్లకో, పదేళ్లకో ఇలా వచ్చేవని.. ఇటీవల తరచూ వస్తున్నాయని, దీనిపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ రోజు, రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అన్ని విభాగల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షణ కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
చెరువులు, కల్వర్టులు, లోలెవల్ కాజ్‌వేలు ఇతర ప్రదేశాల్లో వివిధ శాఖల అధికారులతో పర్యవేక్షణ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ పరిస్థితులపై ప్రతి మూడు గంటలకో బులెటిన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పరిహారం పెంపు…
వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు, పాడి పశువులకు ఇచ్చే పరిహారం రూ.30 వేల నుంచి రూ.50 వేలకు, మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పంట నష్టంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.లక్షన్నర ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 4 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయని, తక్షణమే రంగంలోకి దిగి పంట నష్టం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కామారెడ్డిలో వరదలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం వెంటనే విడుదల చేశామని, ప్రస్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా వివరాలను సమగ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ బృందాలు సైతం తక్షణమే పంట నష్ట పరిశీలనకు వచ్చే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
*ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రైల్వే లైన్ సైతం కొట్టుకుపోవడం, పదుల సంఖ్యలో రోడ్లు, చెరువులకు గండి పడడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, ఇతర ఆస్తి నష్టాలు చోటు చేసుకున్నందున స్వయంగా ప్రధానమంత్రిని పర్యటనకు రావాలని కోరుతూ లేఖ రాయాలని సీఎస్ కు ముఖ్యమంత్రి సూచించారు.
యువ పోలీసులకు ఎన్‌డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ…
రాష్ట్రంలోని 8 బెటాలియన్లలో మూడో వంతు యువ పోలీసులకు ఎన్‌డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ఎన్‌డీఆర్ఎఫ్ నుంచి తక్షణం ఎందుకు అందడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
మనం పెట్టిన ఇండెంట్ ఆధారంగా వాళ్ల దగ్గర ఉన్న బలగాలను పంపుతారని, ఇందుకు సమయం పడుతుందని అధికారులు బదులిచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి మన బెటాలియన్లలోని యువ పోలీసులకు ఎన్‌డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఎక్విప్‌మెంట్ సమస్యగా ఉంటుందని అధికారులు తెలపగా.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదని, వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు.
ఒడిశా, గుజరాత్‌ల్లో అలా శిక్షణ ఇచ్చి బృందాలు ఏర్పాటు చేసుకున్నాయని అధికారులు తెలపగా… అవసరమైతే అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని, అక్కడి అనుభవం ఉన్నవారితో శిక్షణ ఇప్పించాలని సీఎం సూచించారు. దానికోసం ఒక మాన్యువల్ రూపొందించాలని, ప్రతి సీజన్ ముందు శిక్షణ ఇప్పించిన సిబ్బందితో రిహార్సల్స్ చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
జీహెచ్ఎంసీ.. కమిషనరేట్ల పరిధిలో…
నగరంలో ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్, ట్రాఫిక్, తాగు నీరు, శానిటేషన్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలను తరలించాలని సూచించారు.
నిత్యం పనికి వెళ్లే కూలీలు పనులు ఉండక ఇంటి దగ్గరే ఉండిపోతారని, వారిని గుర్తించి బియ్యం, పప్పులు, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.