తప్పు చేసిన ఇరిగేషన్ ఏఈ అధికారిని వెంటనే సస్పెండ్ చేయించిన మంత్రి ఉత్తమ్
తప్పుడు కట్టడాలపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
మంత్రి ఉత్తమ్ కు ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
నీటిపారుదల శాఖ ఏఈని సస్పెండ్ చేయాలి
హుజూర్ నగర్ నీటిపారుదల శాఖ ఏఈ తుమ్మల శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈ రమేష్ బాబును ఆదేశించారు.
పట్టణం లోని మినీ ట్యాంక్ బండ్ ను పరిశీలించిన అనంతరం జిల్లా చీఫ్ ఇంజనీర్ తో ఫోన్ లో మాట్లాడి సస్పెండ్ కు ఆదేశాలు జారీచేశారు. హుజూర్ నగర్ లోని ట్యాంక్ బండ్ ను తప్పుడు ప్రణాళికతో నిర్మించి వరదకు కారణమైన ఏఈని సస్పెండ్ చేయాలన్నారు.
ట్యాంక్ బండ్ నిర్మాణ సమయంలోనే ప్లానింగ్ మార్చాలని చెప్పినప్పటికీ వరద నీటిని చెరువులో నుండి కాలువ ద్వారా శివాలయం వీధిలోకి వదలడంతో శివాలయం, గంగమ్మ దేవాలయం, గోవిందాపురం రోడ్డు లోని ఇళ్ళన్నీ మునిగాయని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఏఈ తుమ్మల శ్రీనివాస్ నీ సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శివాలయం బజారులో 7వ వార్డులో ఉన్న ట్యాంక్ బండును సక్రమంగా లేకపోవడం వల్లే వరద తీవ్రతకు ఇళ్ళల్లోకి నీరు వచ్చిందన్నారు.
చెరువు కట్టకు సాధ్యమైనంత వరకు మరమ్మతులు చేయాలన్నారు. ఇదిలా ఉండగా సహకార పరపతి సంఘం గోదాంలో నీళ్లు వచ్చే వరకూ ఏం చేస్తున్నారని సీఈవో నరేందర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదాంలోకి వర్షపు నీరు ఎలా వచ్చిందని, రోడ్లు కూడా లోతట్టుగా ఉన్నాయని ఆగ్రహం చెందారు.
చెరువు నీటిని ఊళ్లోకి వదిలారు
చెరువులోని నీళ్లన్నీ వచ్చి ఇళ్లు మునిగి వరదతో కూలిపోయాయి. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా వందల ఎకరాల చెరువులోని నీటిని ఊరి మీదకు మళ్లించింది. వద్దన్నా గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల మధ్య నుంచి కాల్వలు తీశారు.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న చెరువుకు పడర వైపు కాల్వ పెట్టి చెరువు నీళ్లను ఊరి మీదకు వదిలి పెట్టారని హుజూర్ నగర్ పట్టణంలోని శివాలయం వీధిలో నివసిస్తున్న ప్రజలు మంత్రి ఉత్తమ్ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వల్పంగా ఇళ్లు కోల్పోయిన వారికి రూ.10వేలు, మొత్తం ఇళ్లు కోల్పోయిన వారికి రూ.5లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారుల తప్పిదంవల్లే చెరువులోని వరదనీరు ఇళ్లలోకి వచ్చిందన్నారు. సంబంధిత ఏఈని సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.