అనితక్కా ..ఏందినీ తిక్క? హోంమంత్రిపై సినీ నటి మాధవీలత ఫైర్ ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతోంది. ఈ నాలుగు నెలల్లో కూటమిలోని పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం బీజేపీ నేతలకు మంటపుట్టించింది.
దీంతో ఆ పార్టీ నేత మాధవీలత టీడీపీకి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితపై ఫైర్ అయ్యారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో గణేశ్ మండపాలకు వివిధ రకాల చలాన్లు విధిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. అయినా కూటమిలో ఉన్నారు కాబట్టి దాదాపుగా అంతా సైలెంట్ గానే గుసగుసలాడుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ నటి కూడా అయిన బీజేపీ నేత మాధవీలత మాత్రం ఓపెన్ అయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనితను గణేశ్ మండపాలకు విధిస్తున్న చలాన్లపై నిలదీశారు.
అనితక్కా.. ఏందినీ తిక్క.. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తానని మాధవీలత పేర్కొన్నారు. ప్రతీ వాళ్లకు హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా అంటూ రెచ్చిపోయారు.
మైక్ పర్మిషన్ కు 100 రూపాయలు, విగ్రహాలకు 350 ఇవ్వాలా ? ఇదే రూల్ ముస్లింలు, క్రిస్టియన్లకు పెట్టండి అంటూ మాధవీలత హోంమంత్రికి ఉచిత సలహా కూడా ఇచ్చారు. దీనిపై టీడీపీవైపు నుంచి కానీ హోంమంత్రి వైపు నుంచి కానీ ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు.