అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులు ఇస్తామని చెబుతున్న తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అర్హులైన జర్నలిస్టులు ఎవరో బహిరంగ ప్రకటన ద్వారా తేల్చి చెప్పాలని,తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు.సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
జర్నలిస్టులను ఏ ప్రాతిపదికన అర్హులుగా గుర్తిస్తారో దాన్ని ఊరించకుండా కుండబద్దలు కొట్టాలని యాదగిరి కోరారు. వర్కింగ్ లో ఉన్న ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో ఉన్న కొంతమంది జర్నలిస్టులకు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ పేరు మీద ఇంటి స్థలాలు ఇవ్వడం హర్షణీయం అన్నారు.
అయితే ఒక హైదరాబాదులో మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారని వారందరికీ ఇంటి స్థలాలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని యాదగిరి డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులు సుమారు 30 వేల మంది వరకు ఉంటారని వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.గతంలో తాము రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఇచ్చిన నివేదికలో పొందుపరిచిన అన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధంగానైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టు కలం కలం గళం గళం కదం కదం కలిపారో అదే విధంగా మాన హక్కులు సాధించు కునేందుకు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్లకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌసుద్దీన్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు సూర్యా పేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడి రవి తదితరులు పాల్గొన్నారు