తెలంగాణలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు..!!
రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై అధిక ప్రభావం
ఆరెంజ్ అలర్ట్జారీ చేసిన వాతావరణశాఖ
ఆ తర్వాత తగ్గుముఖం పట్టనున్న వానలు
హైదరాబాద్ : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. సోమవారానికి రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇచ్చింది.
ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నది. మిగతా మూడు రోజులకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది.హైదరాబాద్ సిటీలో 2 రోజులపాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని పేర్కొన్నది.
జిల్లాల్లో మస్తు వానలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి.
భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరు, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్లో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో 10.9 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 10.6, ఖమ్మం జిల్లా తల్లాడలో 10.3, ఖమ్మం జిల్లా వైరాలో 9.1, వేంసూరులో 9.1, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 8.8, ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో 8.4, మహబూబాబాద్ జిల్లా గర్లలో 8.2, వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేటలో 8.1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 8, టేకులపల్లిలో 7.7, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తీవ్రవాయుగుండంగా బలపడి..
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైంది.
రాబోయే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడి ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.
అయితే, రెండు రోజుల తర్వాత ఈతీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చైనా, వియత్నాంలలో ప్రభావం చూపిస్తున్న యాగి తుఫాను ప్రభావంతో తీవ్రవాయుగుండం దూరంగా వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.