పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలక తీర్పు..
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే తీర్పునిచ్చింది తెలంగాణ హైకోర్టు. సదరు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం.
తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది.
ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ తో పాటు.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. అనంతరం తీర్పును సోమవారం ఉదయానికి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే..
1 . దానం నాగేందర్ – ఖైరతాబాద్
2 . ప్రకాష్ గౌడ్ – రాజేంద్రనగర్
3 . గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరు
4 . కాలె యాదయ్య – చేవెళ్ల
5 . అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి
6 . బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్
7 . ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల
8 . పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
9 . తెల్లం వెంకట్రావు – భద్రాచలం
10 . కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్