ఏఈవో లపై పనిభారం –
ఒత్తిడ్ల మద్య విధుల నిర్వహణ
» ఒక పక్క రుణ మాఫీ, మరోపక్క పంట నష్టం పై సర్వే
» సతమతమవుతున్న ఏఈవో లు
» సహాయకులను ఏర్పాటు చేయాలని వేడుకోలు
ఖమ్మం, మనమే సాక్ష్యం ::: ఎన్నో ఆశలు.. ఆశయాలు.. వ్యవసాయంపై తమకున్న ఆసక్తి మేరకు అగ్రికల్చర్ డిప్లమో చేసిన మహిళలు ఏఈవో లుగా వ్యవసాయ శాఖ లో కొలువులు సాధించారు. అంతవరకు బాగానే ఉంది కానీ కొలువులు సాధించిన వారికి అన్నీ కష్టాలే, చారానా కోడికి భారానా మసాలా అన్నట్టుగా ఇచ్చేది మాత్రం సాలీ సాలని వేతనాలు. చేయించేది మాత్రం బండెడు చాకిరీ, ప్రతి పనికి వారిని చాపను రుద్దినట్లు రుద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్కడ వ్యవసాయ భూమి ఎంత ఉందనే లెక్క కాకుండా ఆనాడు సాగులో ఎంత ఉందనే లెక్కల ఆధారంగా ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్ ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరువు కాలం నాటి లెక్కలను దీనికి ఆధారం చేసుకున్నారు.
దీని తర్వాత ఏటా విస్తారంగా వర్షాలు కురవడం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి వనరులు భాగా పెరగడంతో ఒకప్పటి బీడు భూములు సైతం వంద శాతం సాగులోకి వచ్చాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా భూమి ఖాళీగా లేదు. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో ఏఈవో (వ్యవసాయ విస్తరణ అధికారు) లపై పని భారం పెరిగింది. ఐదు వేల ఎకరాల భాధ్యతలు చూడాల్సిన ఏఈవో లు కొన్ని చోట్ల 10 వేల ఎకరాలకు పైగా చూడాల్సి వస్తోంది.
ఫిల్డ్ లెవల్ లో ఇద్దరు ముగ్గురు చేయాల్చిన పనిని ఒక్కరే చేస్తుండటంతో ఏఈవో లపై దాదాపు 60 శాతం అదనంగా పని భారం పడుతుంది. రైతు వేదికల నిర్వహణతో పాటు గ్రామాల్లో సర్వే నెంబర్ల వారీగా పంటల నమోదు, రైతు భీమా, రైతు బందు, పంటల కొనుగోళ్లు తదితర భాధ్యతలతో ఏఈవో లకు పని భారం పెరుగుతోంది.అది అలా ఉంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డ చందంగా ఉంది ఏఈవో ల పరిస్థితి.
మూడు విడుతల్లోనూ రుణ మాఫీ కాని రైతుల లిస్ట్ పట్టుకొని సర్వే పేరుతో ఊరూరా తిరుగుతూ బిజీగా ఉన్న ఏఈవో లపై మరో పిడుగు పడింది. భారీ వర్షాలకు జరిగిన పంట నష్టంపై ఈ నెల 12 కల్లా సర్వే రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దీంతో ఉరుకులు, పరుగులతో లతో పంట నష్టం పై క్షేత్రస్థాయిలో ఏఈవోలు ఎన్యూమరేషన్ సర్వే చేస్తున్నారు. ప్రత్యేక ఎక్సెల్ షీట్ లో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు.
ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది. తమ ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తమకు సహాయకులను ఏర్పాటు చేయాలని ఏఈవో లు కోరుతున్నారు.