నా అనుమతులు లేకుండా నా ఫోటో తీశారు
పీటీ ఉష చేసిందేంటి?
తెర వెనుక రాజకీయాల వల్లే నాకిలా జరిగింది..
వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్
రెజ్లర్ వినేశ్ ఫోగాట్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ చేరి చరిత్ర సృష్టించినా.. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్న కారణంగా మెడల్ కోల్పోయిన ఆమె..అక్కడ జరిగిన తెర వెనుక రాజకీయాల వల్లే ఇలా జరిగిందని చెప్పడం గమనార్హం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు తన అనుమతి లేకుండానే ఫొటో దిగడం తప్ప చేసిందేంటనీ ఆమె ప్రశ్నించింది.
వినేశ్ ఫోగాట్ సంచలన కామెంట్స్
పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ ఖాయం అనుకున్న సమయంలో అనూహ్యంగా అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగాట్.. క్రమంగా తన వ్యాఖ్యల పదును పెంచుతోంది.
తాజాగా ఓ స్థానిక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల వల్లే ఇలా జరిగిందని చెప్పడం షాక్ కు గురి చేస్తోంది.
50 కేజీల విభాగంలో తలపడాల్సిన ఆమె.. ఫైనల్ రోజు ఉదయం 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే.
“నాకు ఎలాంటి మద్దతు లభించిందో నాకైతే తెలియదు. పీటీ ఉష మేడమ్ హాస్పిటల్ కు వచ్చింది. ఓ ఫొటో తీసుకుంది. తెర వెనుక రాజకీయాల గురించి మనం మాట్లాడుకుంటాం కదా.. పారిస్ లోనూ రాజకీయాలు జరిగాయి.
అందుకే నాకీ గుండెకోత. ఎందుకు రెజ్లింగ్ వదిలేస్తున్నవని చాలా మంది అడుగుతున్నారు. కానీ ఎవరి కోసం నేను కొనసాగాలి. ఎక్కడ చూసినా రాజకీయాలే” అని కాంగ్రెస్ లో చేరిన వినేశ్ చెప్పింది.
అనుమతి లేకుండానే ఫొటో తీశారు
ఇక హాస్పిటల్ బెడ్ పై ఉన్న తన ఫొటోను తన అనుమతి లేకుండా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వినేశ్ తెలిపింది.
“నేను హాస్పిటల్ బెడ్ పై ఉన్నాను. బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. జీవితంలో చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను.
అలాంటి సమయంలో నాకు మద్దతు నిలిచానని చెప్పడానికి ఏదో నా పక్కన నిలబడి నా అనుమతి లేకుండానే ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మద్దతు తెలిపేది ఇలా కాదు. కేవలం పోజులివ్వడమే” అని వినేశ్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
రాజకీయాల్లోకి వినేశ్
ప్రతి చోటా రాజకీయాలే జరుగుతున్నాయని అన్న వినేశ్.. తాను కూడా అదే రాజకీయాల్లోకి చేరి కొత్త కెరీర్ మొదలు పెట్టింది. పారిస్ ఒలింపిక్స్ నుంచి మెడల్ లేకుండానే వచ్చినా.. ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు స్వాగతం పలికారు.
ఆ తర్వాత ఆమె మరో రెజ్లర్ భజరంగ్ పూనియాతో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం గమనార్హం. హర్యానా ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేయబోతోంది.