MGM ఆస్పత్రిలో రౌడీ రాణి రాజమ్మ అరెస్ట్
ఎంజీఎంలో విధులకు వెళ్తున్న ఉద్యోగిని అడ్డగించి బెదిరించి దాడికి పాల్పడిన మహిళను అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ టి.గోపి మంగళవారం తెలిపారు.
ఇన్స్పెక్టర్ గోపి కథనం ప్రకారం.. బిల్ల సుమలత 15 సంవత్సరాల నుంచి ఎంజీఎంలో ఔట్సోరి్సంగ్గా, రెండు సంవత్సరాల నుంచి పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈనెల 9న మధ్యాహ్నం షిఫ్ట్ విధుల్లో భాగంగా ఎంజీఎంలోని బయోమెట్రిక్ మెషీన్ వద్దకు వచ్చి హాజరు వేస్తుండగా ఆలకుంట రాజమ్మ.. సుమలతను అడ్డుకుంది.
‘నీ నియామకానికి జీఓ తెచ్చింది నేనే.. అందుకే రూ.2 లక్షలు లంచం ఇస్తావా లేదా..లేకుంటే నిన్ను చంపేస్తా’ అంటూ బెదిరిస్తూ చైన్‌తో విచక్షణరహితంగా సుమలతను కొడుతూ తన వద్ద ఉన్న పదివేల రూపాయలు లాక్కొని, ఆమె మొబైల్ ను కింద కొట్టిందని బాధిత మహిళ బిళ్ళ సుమలత ఫిర్యాదు చేసిందని తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని మంగళవారం ఉదయం నిందితురాలైన ఆలకుంట రాజమ్మను అరెస్టు చేసి, ఆమె వద్ద ఉన్న వెయ్యి రూపాయల నగదు, దాడికి ఉపయోగించిన ఇనుప చైన్ ను స్వాధీనపరచుకొని రాజమ్మను రిమాండ్ కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మట్టేవాడ ఇన్స్పెక్టర్ తుమ్మ గోపి, ఎస్సై విటల్ పాల్గొన్నారు.
ఎంజీఎం ఘటనపై దోషులను శిక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఉద్యోగి సుమలతపై దాడికి పాల్పడిన దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు.
సుమలతపై దాడికి పాల్పడిన రాజమ్మ గతంలో ఎంజీఎంలో విధులు నిర్వర్తించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల నేపథ్యంలో విధుల నుంచి తొలగించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలను ఊపేక్షించేది లేదని, నిందితులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో వైద్యులు, సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్ప డితే రౌడీషీట్ ఓపెన్ చేసి కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.