కాంగ్రెస్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఆయన అనుచరుడికి బుల్లెట్ గాయాలయ్యాయి.ఈ కాల్పుల సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో ఈ సంఘటన జరిగింది. కల్కా నియోజకవర్గం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పంచకులాలో ఆయన కాన్వాయ్ పై కాల్పులు జరిగాయి.
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆ ఎమ్మెల్యే అనుచరుడైన గోల్డీకి రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్ గాయాలైన గోల్డీని చికిత్స కోసం చండీగఢ్లోని పీజీఐకి తరలించారు.
అతడికి నేర కార్యకలాపాలతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఠాల మధ్య శత్రుత్వమే ఈ కాల్పులకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.