బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్…
భారాస నేతల ఇళ్లకు పోలీసులు.. గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా అడ్డగింత
భారాస నేతలు సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇళ్లకు పోలీసులు వెళ్లారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల భారాస కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
వైద్య, ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. దీంతో ముగ్గురు నేతల అరెస్టుకు పోలీసులు యత్నించారు.
ఈ సందర్భంగా భారాస నేతలు మాట్లాడుతూ.. ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకు అని నిలదీశారు. అక్కడి మాతా శిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని భయపడుతున్నారా అని ప్రశ్నించారు. మరోవైపు తమ ఇళ్ల నుంచి పోలీసులు వెళ్లిపోవాలని భారాస నేతలు కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలన్నారు.
గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రత పెంచారు. భారాస నేతల పర్యటన దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు?: కేటీఆర్
భారాస నిజ నిర్ధరణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో కమిటీ వేశామన్నారు.
గాంధీ ఆసుపత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని నిలదీశారు. సీఎం, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని కేటీఆర్ తెలిపారు.