వరద బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి కట్టుదిట్టమైన చర్యలు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ
సర్టిఫికెట్ జారీ కోసం ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు
237 పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు
ముంపు బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ, పాఠశాల విద్యలో తీసుకుంటున్న చర్యలపై అదనపు కలెక్టర్ మీడియా సమావేశం
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, సెప్టెంబర్-25:
వరద బాధితులు కోల్పోయిన వివిధ రకాల సర్టిఫికెట్ల జారీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు.
బుధవారం ముంపు బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ, పాఠశాల విద్యలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వరదల కారణంగా దెబ్బతిన ఇండ్లలో వరద బాధితులు కోల్పోయిన సర్టిఫికెట్ల జారీకి ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వరదల కారణంగా కోల్పోయిన సర్టిఫికెట్ల జారీ కోసం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇండ్ల వద్ద నిర్వహించిన సర్వే ఆధారంగా ఇప్పటి వరకు దాదాపు పదవ తరగతి సర్టిఫికెట్ల కోసం 680, ఇంటర్ 454, డిగ్రీ/బీటెక్ సంబంధించి 94, పీజి 47, పాస్ పోర్ట్ కొరకు 29 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
అదే విధంగా రెవెన్యూ కి సంబంధించి ఆదాయ సర్టిఫికెట్లు 269, కుల ధ్రువీకరణ పత్రాలు 376, నివాస ధ్రువీకరణ పత్రాలు 189, ఓబిసి సర్టిఫికెట్లు 77, పాస్ పుస్తకాలు 88, ఆధార్ కార్డు 388, రేషన్ కార్డు 182 కోల్పోయినట్లు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
విద్యా సర్టిఫికెట్లకు సంబంధించి విద్యార్థి పేరు, చిరునామా, పాసైన సంవత్సర వివరాలు విద్యా శాఖకు జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిపాదనలు పంపి సర్టిఫికెట్ల జారీ చేయిస్తామని అన్నారు.
పాస్ పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడి వాటిని జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ సంబంధిత సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
రాబోయే రెండు, మూడు వారాలలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వారికి సంబంధించిన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అదనపు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని 237 ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ లో శిక్షణ అందించేందుకు వారానికి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనికోసం 120 మంది మాస్టర్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు.
ప్రతి బుధవారం జిల్లా అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి, విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అందిస్తున్నారని అదనపు కలెక్టర్ అన్నారు.
ప్రతి నెలా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పకడ్బందీగా జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థుల హాజరు, పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణను కలెక్టర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
జిల్లాలోని 50 పాఠశాలల్లో ముందస్తుగా ఇంగ్లీష్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో దశల వారీగా జిల్లా వ్యాప్తంగా ఈ ల్యాబ్ లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం పాత్రికేయులు అడిగిన వివిధ సందేహాలకు, ప్రశ్నలకు అదనపు కలెక్టర్ సమాధానాలు చెప్పారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.