15 లక్షల రేషన్‌కార్డుల రద్దు?
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్‌కార్డుల్లో సుమారు 15 లక్షల కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి. కార్డుదారులను గుర్తించేందుకు చేపట్టిన ఈ-కేవైసీ ప్రక్రియకు హాజరు కాకపోవడంతో వారందరినీ అనర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.
ఈ మేరకు వారి కార్డులను రద్దు చేయనుంది. అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేయనుంది. ఇందుకోసం అక్టోబరు నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్ర మొత్తం జనాభా 3.83 కోట్లు కాగా, 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి.
ప్రభుత్వం దరఖాస్తుదారుడి అర్హతలను పూర్తిగా విచారించకుండానే గతంలో కార్డులు జారీ చేయడంతో.. వీటి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. దీంతో వీరిలో అనర్హులను గుర్తించేందుకు గత ఏడాది అక్టోబరు నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి తెల్ల కార్డుదారుడు కుటుంబసభ్యులందరితో కలిసి బయోమెట్రిక్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఆరు నెలలపాటు కొనసాగి.. ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే దాదాపు 15 లక్షల కార్డుదారులు ఈ-కేవైసీకి హాజరు కాలేదని తెలిసింది.
ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడమో, మరే ఇతర కారణాలతోనే వీరు ఈ-కేవైసీకి హాజరు కాలేదు. దీంతో దాదాపు 15 లక్షల కార్డులు అనర్హుల పేరిట ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ కార్డులన్నింటినీ రద్దు చేయనున్నారు. వీటిని రద్దు చేయడం ద్వారా.. కొత్తగా జారీ చేసే కార్డులతో ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏటా పెరిగిపోయిన కార్డులు..
తెల్ల రేషన్‌కార్డుల జారీ అంశం రాజకీయాలనూ ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతి ఎన్నికల్లో రేషన్‌కార్డుల అంశాన్ని ప్రధాన పార్టీలు ప్రస్తావిస్తుంటాయి. ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా గత ప్రభుత్వం హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో తెల్ల కార్డులు జారీ చేసింది.
చివరిగా 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 3.60 లక్షల కొత్త కార్డులు జారీ చేశారు. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 89.96 లక్షల మందికి తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. కాగా, ఈ కార్డులు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల పేర్లను నమోదు చేసుకునేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.
మరికొందరు కొత్త కొర్డుల కోసం కూడా దరఖాస్తు చేశారు. గత కొన్నేళ్ల నుంచి ఇలా వచ్చిన దరఖాస్తులు దాదాపు 12 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. అక్టోబరు నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో.. ఇకపై రేషన్‌కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కార్డు జారీ చేశాక అనర్హులని తేలితే దానిని రద్దు చేయడం కంటే.. ప్రారంభంలోనే అర్హులను గుర్తించాలని యోచిస్తోంది. ఇందుకోసం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి డేటా ప్రభుత్వం వద్ద ఉంది. సిటిజన్ 360 పేరుతో పౌరుల వివరాలను గత ప్రభుత్వం సేకరించింది.
ఇందులో ప్రతి పౌరుడి ఆధార్‌తో అనుసంధానమైన వివరాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇదే సాఫ్ట్‌వేర్‌ను తెల్ల రేషన్ కార్డుల జారీలో అర్హులను గుర్తించేందుకు ఉపయోగించాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అందరు తహసీల్దార్‌ల వద్ద ఈ సమాచారం అందుబాటులో ఉంది.
వారికి సిటిజన్ 360 సాఫ్ట్‌వేర్ లాగిన్ వివరాలను మూడు నెలల క్రితమే అందించింది. దీని ద్వారా రేషన్‌కార్డులకు అర్హులైన వారిని తహసీల్దార్లు గుర్తించనున్నారు. ఆధార్‌తో ఆస్తులు, వాహనాల రిజిస్ర్టేషన్‌తోపాటు ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలన్నీ అనుసంధానమై ఉన్నందున.. వాటి ఆధారంగా దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఇందులో అనర్హులుగా తేలినవారిని పక్కనబెట్టి అర్హులకు మాత్రమే కార్డును జారీ చేయనున్నారు.