పేషెంట్లకు ఉత్తమ వైద్య సేవలందించాలి…
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే
సి కే న్యూస్ (సంపత్) సెప్టెంబర్ 25
పేషెంట్లకు ఉత్తమ వైద్య సేవలందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే వైద్య అధికారులకు సూచించారు.బుధవారం నాడు ఆయన రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. వార్డులన్నింటిని కలియదిరిగి పేషెంట్లతో మాట్లాడారు.
వారు ఎలాంటి అనారోగ్య కారణాలపై ఆసుపత్రికి వచ్చింది,ఏ గ్రామాల నుండి వచ్చింది,ఎన్ని రోజలయ్యింది, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.వారితో మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమని, త్రాగే నీరు వేడి చేసి చల్లార్చి తాగాలని,వేడి ఆహారం తీసుకోవాలని,ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సహాయం పొందాలని,ప్రభుత్వం అన్ని రకాల పరీక్షలు,మందులు అందిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా పేషెంట్లకు అందుతున్న వైద్యం, అందుకు సంబంధించిన మందులను, రికార్డులను పరిశీలించారు.ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలకు సంబంధించి అవసరమైతే సి.ఎస్.ఆర్. నిధుల నుండి మంజూరు చేస్తామని, గర్భిణీ స్త్రీల ఓ.పి. ఎక్కువ ఉన్నందున గైనకాలజిస్ట్,రేడియాలజిస్ట్ లను నియమిస్తామని తెలిపారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.
పరిశుభ్రత, పారిశుద్యం పెంపొందేలా చర్యలు తీసుకోవాలని,క్లోరినేషన్,బ్లీచింగ్ నిర్వహించాలని,వర్షపునీరు పోయేలా ఇంకుడు గుంత నిర్మించాలని అధికారులను ఆదేశించారు.సీజనల్ వ్యాధుల పట్లఅప్రమత్తంగా ఉండాలని, అందుకు ముందస్తు చర్యలలో భాగంగా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.
వెంట జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ చిన్నానాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్, తహశీలుదారు లాల్ బహదూర్ శాస్తి, మండల అభివృద్ది అధికారి యాకూబ్ నాయక్, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.