సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు.. నేను బడికి వెళ్లను అమ్మా! టీచర్‌ అకృత్యంపై చిన్నారి ఆవేదన తల్లి ఫిర్యాదుతో అరెస్టు చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటుచేసుకుంది. 'సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు.. బడికి వెళ్లను' అని ఆ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. గురువు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు …

సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు.. నేను బడికి వెళ్లను అమ్మా! టీచర్‌ అకృత్యంపై చిన్నారి ఆవేదన

తల్లి ఫిర్యాదుతో అరెస్టు

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటుచేసుకుంది.

'సార్‌ నన్ను రోజూ బ్యాడ్‌ టచ్‌ చేస్తున్నారు.. బడికి వెళ్లను' అని ఆ చిన్నారి మారాం చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. గురువు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతోంది. బడికి వెళ్లాలంటేనే భయంతో మొండికేస్తోంది.

తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి పంపిస్తున్నారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని రోదిస్తోంది. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం ఎందుకు బడికి వెళ్లనంటున్నావని తల్లి ప్రశ్నించింది. ఆ చిన్నారి బావురుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది.

గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.చంద్రశేఖర్‌ (42) కొంతకాలంగా నాలుగో తరగతి విద్యార్థినిని అసభ్యంగా తాకుతున్నాడని.. దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని ఆమె తల్లి గుడివాడ తాలుకా పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. తాలూకా ఎస్సై ఎన్‌.చంటిబాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Updated On 27 Sept 2024 11:05 AM IST
cknews1122

cknews1122

Next Story