వైద్యం వికటించి బాలింత మృతి.. నిండు ప్రాణం ఖరీదు రూ.5 లక్షలు వెలకట్టిన వైద్యులు
వైద్యం వికటించి బాలింత మృతి చెందిన సంఘటన సత్తుపల్లి ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రావణి ( 21) నిండు నెలల గర్భిణీ.ఇక నెలలు నిండటంతో సత్తుపల్లి పాత సెంటర్ నందు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు గురువారం రాత్రి ఆసుపత్రి వైద్యురాలు ఆపరేషన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆపరేషన్ వికటించినట్టు తెలియడంతో తీవ్ర రక్తస్రావమై అప్పటికే శ్రావణి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ వైద్యులు చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు ఆమె మృతదేహాన్ని సత్తుపల్లికి తీసుకొచ్చి.. ఆసుపత్రి ఎదుట ఉంచి శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. అప్పుడు ఆస్పత్రి నిర్వాహకులు శ్రావణి బంధువుల మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు వైద్యులు, రాజకీయ ప్రముఖులు చేరి రాజీ కుదిరిచినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక రాజీ కుదరటంతో బంధువులు మృతదేహాన్ని తీసుకొని వారి గ్రామానికి తరలి వెళ్లినట్లు తెలుస్తోంది.
నిండు ప్రాణం ఖరీదు 5 లక్షలు వెలకట్టిన వైద్యులు
గురువారం రాత్రి ఆపరేషన్ వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించి శుక్రవారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన శ్రావణి (21) ప్రాణానికి, అలాగే గతంలో ప్లేట్‌లేట్స్ తక్కువయ్యాయని ఆసుపత్రిలో చేరిన విద్యార్థి సన తబూసం(15) ప్రాణానికి.. ఇలా ఇద్దరు ప్రాణాలకి చెరో రూ. 5 లక్షల రూపాయలు వెలకట్టి వైద్యులు, రాజకీయ ప్రముఖులు కొందరు రాజీ కుదర్చడం పై సర్వత్ర చర్చలు కొనసాగుతున్నాయి. వైద్యులపై చర్యలు చేపట్టకుండా రాలిపోతున్న ప్రాణాలకు వెలకట్టటంపై స్థానిక ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.