శ్రీచైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్.. క్యాంపస్‌లోనే ట్రీట్మెంట్
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య కాలేజీ అక్షర భవన్క్యాంపస్లో గురువారం ఫుడ్ పాయిజన్ జరిగినట్లు తెలుస్తోంది.
దాదాపు 100 మంది స్టూడెంట్స్కడుపునొప్పి, విరేచనాలు, జ్వరంతో బాధపడుతుండడంతో కాలేజీ మేనేజ్మెంట్ క్యాంపస్‌లోనే గోప్యంగా ట్రీట్మెంట్ అందించింది. తొలుత ఈ విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది.
కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులను పిలిపించి మెరుగైన ట్రీట్మెంట్ కోసం బయటకు పంపించింది.
అంతకుముందు అస్వస్థతకు గురైన స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులను బయటకు రానీయకుండా కాలేజీ గేట్లను మూసివేసింది. దీంతో ఏబీవీపీ నాయకులు క్యాంపస్ ముందు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. కాలేజీ మేనేజ్మెంట్ను వివరణ కోరగా, ఎలాంటి ఫుడ్ పాయిజన్ జరగలేదని, విద్యార్థులకు వైరల్‌ఫీవర్ వచ్చినట్లు తెలిపారు.
కాలేజీకి రూ.2 లక్షల ఫైన్
మరోవైపు, కాలేజీ క్యాంపస్‌ను స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం సందర్శించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. అలాగే కాలేజీ కిచెన్, క్యాంటీన్‌ను జీహెచ్ఎంసీ చందానగర్సర్కిల్అధికారులు తనిఖీ చేశారు. ఫైర్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో రూ. 2లక్షలు ఫైన్ విధించారు.