వైద్యం వికటించి మహిళ మృతి…
పీఎంపీ వైద్యం వికటించి ఓ వివాహిత మృతి చెందిన ఘటన సీసీసీ నస్పూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నస్పూర్ నాగార్జునకాలనీకి చెందిన చింతం శ్రీలతకు ఈ నెల 27న రాత్రి జ్వరం వచ్చింది.
దీంతో ఆమె భర్త చింతం రాజు 28న సమీపంలోని పీఎంపీ వైద్యుడు బిరుదుల ప్రశాంత్‌ను ఇంటికి పిలిపించాడు. పీఎంపీ ఇంట్లోనే శ్రీలతకు సెలైన్ బాటిల్ పెట్టి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటికే ఆమె చలికి వణుకుతూ తీవ్ర అస్వస్థతతకు గురైంది. దీంతో వెంటనే పీఎంపీ వైద్యుడికి సమాచారం అందించగా, ఆయన వచ్చి సెలైన్ తొలగించాడు. ఏమీ కాదంటూ ఇంజెక్షన్ వేసి వెళ్లిపోయాడు.
వైద్యుడు వచ్చి వెళ్లిన తర్వాత భర్త చింతం రాజు కూతురును తీసుకురావడానికి స్కూల్‌కు వెళ్లాడు. అతను వచ్చి చూసే సరికి భార్య శ్రీలత వాంతులు, విరేచనాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది.
ఆందోళనకు గురైన రాజు వెంటనే ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉందని గమనించిన వైద్యులు కరీంనగర్‌కు రెఫర్ చేశారు.
కరీంనగర్‌కు తరలించగా, అక్కడి వైద్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లాని సూచించారు. హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షంచి బ్రెయిన్‌డెడ్ అయిందని తెలిపారు.
అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రాణాలు విడిచింది. సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ సుగుణాకర్ శ్రీలత ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు.
అనంతరం గోదావరికాలనీలోని పీఎంపీ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎంపీ వేసిన ఇంజెక్షన్, స్లైన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ పక్కనే ఉన్న మహాలక్ష్మి మెడికల్ షాపు నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కేసులు
ఆర్‌ఎంపీ, పీఎంపీలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్సలు అందించి, రెఫర్ చేయకుండా సొంత వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇటీవల వైద్యం వికటించి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం విదితమే. ఈ ఏడాది మే 30న సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు.
నస్పూర్‌లోని విద్యానగర్‌లో క్లినిక్ నడిపిస్తున్న గుండా సుధాకర్, సీసీసీలో చుంచు శంకర్‌వర్మ, బిట్ల వెంకటస్వామి, నిగ్గుల కుమారస్వామి, గాంధీనగర్‌కు చెందిన అటికం శ్రీనివాస్‌లపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు నడిస్తున్నారని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు మామిడాల రాము వీరిపై కేసులు నమోదు చేసి సీసీసీ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు.
కేసుల భయంతో కొద్ది రోజులు క్లినిక్‌లలో ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైద్య సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో భయం భయంగా వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. క్లినిక్‌లలో కాకుండా ఇంటి వద్దకు వెల్లి వైద్యం అందిస్తున్నారు.