స్కూల్ బస్సు క్రింద పడి చిన్నారి మృతి…
బతుకమ్మ వేడుకలకని వెళ్ళి తిరిగిరాని లోకానికి చిన్నారి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారిని చిదిమేసింది. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం వెంకటలక్ష్మి- భూమరాజుల కూతురు మనోజ్ఞ(5) స్కూల్ బస్సు క్రింద పడి ప్రాణాలు కోల్పోయారు.
తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఉపాధి నిమిత్తం రెండేళ్ల కిందట దుబాయ్ వెళ్లారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి నర్సరీ చదువుతోంది. జ్వరం రావడంతో వారం రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు.
జ్వరం తగ్గడం, పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని టీచర్ చెప్పడంతో మనోజ్ఞ స్కూల్ కు వెళ్లింది. ఎప్పటి మాదిరిగానే మనోజ్ఞ బస్సు దిగి తరగతి గదిలోకి వెళ్ళే క్రమంలో బస్సు డ్రైవర్ సరిగా గమనించక అజాగ్రత్తగా బస్సు నడపడంతో చిన్నారి తలపై నుంచి వెనక టైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి తోపాటు బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు.
సల్కం వెంకటలక్ష్మి- భూమరాజులకు సంతానం కలగలేదు. పిల్లలు పుట్టే యోగం లేకపోవడంతో దగ్గరి బంధువుల వద్ద మనోజ్ఞ ను దత్తత తీసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.
భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళగా వెంకటలక్ష్మి ఆ చిన్నారే తనకు సర్వస్వంగా భావిస్తు ప్రాణంగా చూసుకుంటుంది. అనూహ్యంగా స్కూల్ బస్సు క్రింద పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి రోదన చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.
కడుపున పుట్టిన బిడ్డ కాకపోయినా, సంతానం లేమి బాధతో ఆ చిన్నారిని ప్రాణంగా చూసుకుంటున్న తరుణంలో విధి వెక్కిరించి ప్రాణాలు కోల్పోవడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
ఆందోళన… ఉద్రిక్తత
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో బంధువులతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.
పాఠశాలను సీజ్ చేసి స్కూల్ యాజమాన్యంతో పాటు డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ పై దాడికి యత్నించగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు.
చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. డిఈవో రమేశ్ కుమార్ తోపాటు ఆర్డీఓ రమేశ్ అక్కడికి చేరుకొని పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి స్కూల్ గేటుకు తాళం వేయించడంతో ఆందోళన విరమించారు.
డ్రైవర్ క్లీనర్ పై కేసు అరెస్టు…
స్కూల్ లో బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడేందుకు వెళ్ళి బస్సు క్రింద పడి చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ముస్తాబాద్ పోలీసులు స్కూల్ బస్ డ్రైవర్ గురుమూర్తి, క్లీనర్ రాజుపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ ప్రకటించారు.