కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. పోలీస్ అలర్ట్..
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగిన ఘటన సోమవారం జరిగింది.ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
చివరి వరకు తన గెలుపు ఖాయమంటూ ఫిరోజ్ ధీమాగా ఉన్నారు. కానీ చివరికి స్థానిక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయాన్ని అందుకున్నారు. అది కూడా కేవలం 1500 ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
అయితే ఫిరోజ్ ఖాన్, అక్కడి స్థానిక ఎమ్మెల్యే అనుచరగణం మధ్య ఎప్పుడూ మాటల యుద్దం సాగుతూ ఉంటుంది. ఆ మాటల యుద్దం ఈసారి దాడికి దారితీసిందని స్థానికుల అభిప్రాయం. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్ లో గల బ్యాంక్ కాలనీ వద్ద పలు అభివృద్ది పనులు జరుగుతున్నాయి.
అందులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండగా.. వాటి పరిశీలనకు ఫిరోజ్ ఖాన్, తన అనుచరులతో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడ గల స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, ఎంఐఎం కార్యకర్తలు.. ఫిరోజ్ ఖాన్ కు అడ్డు తగిలారు.
దీనితో రెండు వర్గాల మధ్య కాసేపు వాడివేడిగా మాటల యుద్దం సాగింది. ఇక కొద్ది క్షణాల్లోనే.. మాటలు చేతల దాకా వచ్చాయి. ఇంకేముంది రెండు వర్గాలు ఒక్కసారిగా ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది.
దీనికి బ్యాంక్ కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా.. పోలీసులు వెంటనే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసుల ముందే రెండు వర్గాలు అలాగే ఘర్షణకు పాల్పడుతుండగా.. పోలీసులు నివారించేందుకు శ్రమించాల్సి వచ్చింది.
కాగా ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కు గాయాలు కాగా, పలువురు కాంగ్రెస్ లీడర్స్ కి కూడా స్వల్ప గాయాలయ్యాయి. అలాగే ఎంఐఎం నాయకులకు కూడా గాయాలయ్యాయి.
అసలు ఈ ఘర్షణకు దారి తీసిన విషయాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆసిఫ్ నగర్ లో మోహరించారు.