వరంగల్ ఏసీపీపై వేటు?
రంగం సిద్ధం చేసిన ఉన్నతాధికారులు
ఇప్పటికే ఇద్దరు సీఐలపై క్రమశిక్షణ చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ డివిజన్ ఏసీపీ నంది రాంనాయక్ పై బదిలీ వేటు పడనున్నట్లు అధికారిక సమాచారం.
ఒకటిరెండు రోజుల్లో ఆయనపై వేటు వేసి కొత్త ఏసీపీని నియమించేలా చర్యలు ప్రారంభమైనట్లు తెలిసింది. ఇప్పటికే వరంగల్ డివిజన్లోని ఇద్దరు సీఐలపై బదిలీ వేటుపడగా, ఏసీపీపై కూడా బదిలీ వేటు పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వరంగల్ పోలీసు డివిజన్ పరిధిలోని ఏసీపీతో పాటు ఇద్దరు సీఐలు ప్రైవేటు వ్యక్తుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, దైవ దర్శనాలకు ఎస్కార్డ్ వెళ్లడం వివాదాస్పదమైంది.
ఈ విషయమై సీపీ అంబర్ కిషోర్ ఝా విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా మిల్కాలనీ, ఇంతేజార్ గంజ్ సీఐలు మల్లయ్య, శివకుమార్ పై వేటు పడింది. ఇద్దరిపై బదిలీ వేటు వేసి ఏసీపీని మినహాయించారనే ప్రచారం జరిగింది.
ప్రైవేటు వ్యక్తులు ఏసీపీ బదిలీ కాకుండా కాపాడుతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీపై బదిలీ వేటు వేయాలని శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకటి రెండురోజుల్లో ఏసీపీపై బదిలీ వేటుపడే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం.
కాగా కొత్త ఏసీపీ నియామకం సైతం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా వరంగల్ డివిజన్ పోలీసు అధికారులు ప్రైవేటు వ్యక్తులకు అధికారిక సేవలు అందించి క్రమ శిక్షణా చర్యలకు గురికావడం చర్చనీయాంశంగా మారింది.
సీపీకి తలనొప్పి
కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీసు అధికారుల తీరు సీపీ అంబర్ కిషోర్ ఝాకు తలనొప్పిగా మారింది. పలువురు పోలీసు అధికారుల దందాలు, పోస్టింగ్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు సేవలు చేయడం, ఇతరత్రా విషయాలు ఎక్కువ కావడం ఇబ్బందికరంగా మారినట్లు తెలిసింది.
ఈ విషయాలను కట్టడి చేయడం సీపీవల్ల కావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల జపం చేస్తున్న పోలీసు అధికారులు సీపీ ఆదేశాలు సైతం లెక్కచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజువారిగా సమీ క్లలు జరుపుతూ ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందనే విమర్శలున్నాయి.
దందాలు చేసే పోలీసుల వైఖరి విషయంలో ప్రజాప్రతినిధులు సైతం సీపీపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రైవేటు వ్యక్తికి గన్ మెన్లు ఇవ్వడం, అతడికి పోలీసులు సేవలు చేయడంపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు సీపీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కమిషనరేట్ పరిదిలో ప్రధానంగా వరంగల్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారుల తీరుపై సీఎం పేషీ నుంచి ఆరా తీసినట్లు తెలిసింది. మొత్తంగా కమిషనరేట్ పరిధిలోని కొంతమంది అధికారుల తీరు శాఖకు మచ్చతేవడంతో పాటు సీపీకి తలనొప్పిగా మారడం గమనార్హం.