ఒక్కరోజు పోలీస్ కస్టడీకి తహసీల్దార్
జయశ్రీ బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా
వజ్రాల జయశ్రీ గతంలో హుజూర్ నగర్ ఎమ్మార్వోగా పనిచేసినపుడు తన పదవీకాలంలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరులకు బదిలీ చేసి అట్టి భూములపై వచ్చిన రైతుబంధు నిధులను స్వాహా చేశారనే ఆరోపణలతో బుధవారం హుజూర్ నగర్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి మారుతి ప్రసాద్ ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించి ఆమెను పోలీసులు స్థానిక సబ్ జైలుకు తరలించడం జరిగింది.
కాగా గురువారం హుజూర్ నగర్ సీఐ తమ దర్యాప్తులో భాగంగా జయశ్రీ నుండి మరింత సమాచారాన్ని రాబట్టడం కొరకు ఆమెను ఇంకా విచారించవలసి ఉన్నదని తెలుపుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తహశీల్దార్ జయశ్రీని 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించమని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరో పక్క జయశ్రీ తరపు న్యాయవాది ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీ పిటిషన్ ను గురువారం న్యాయమూర్తి మారుతి ప్రసాద్ విచారించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తహశీల్దార్ జయశ్రీని శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల లోపు విచారించుటకు పోలీసులకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కాగా శుక్ర, శని, ఆది వారాలు న్యాయస్థానాలకు సెలవు దినాలు కావడంతో ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.