ప్రపంచ స్థాయిలో పోటీపడే మానవ వనరుల సృష్టి కై ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు
– రాష్ట్రంలో విద్య వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం కృషి
– ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా పక్కాభవనాలు
(శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క)
సికె న్యూస్ ప్రతినిధి మధిర నియోజకవర్గం :
ప్రపంచ స్థాయిలో పోటీపడే మానవ వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆలోచనతోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పనులకు భూమి పూజ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శుక్రవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామం లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆయన ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, సమాజాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఉమ్మడి కుటుంబం గా ముందుకు తీసుకువెళ్లాలనే కాంగ్రెస్ మూల సిద్ధాంతమన్నారు.
ఆ ఆలోచనలు అనుభవంతోనే ఈ పాఠశాలల నిర్మాణానికి రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం ఆలోచన చేసామన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణలో సమ సమాజం లక్ష్యాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు విధానాలు రూపొందిస్తున్నామన్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వస్తే ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎత్తివేస్తారన్న భావనలో కొందరు ఉన్నారని, ఆలోచన సరైంది కాదన్నారు. ఎప్పటిలాగే అవి కొనసాగుతాయని, వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.
తన చిన్ననాటి జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, నేను ఎదుర్కొన్న చిన్న ఇబ్బంది కూడా మరొకరు ఎదుర్కోవద్దన్న ఆలోచనతో ప్రతి చిన్న విషయాన్ని గమనంలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నమూనాలను రూపొందించామని భట్టి విక్రమార్క అన్నారు.
ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని నేను ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిజైన్లు రూపొందించాం. మంత్రిమండలిలో చర్చించి కార్యాచరణ రూపొందించామని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో కరెంటు, నీళ్లు వంటి ప్రాథమిక సమస్యలు తీర్చేందుకు రూ.1100 కోట్లు కేటాయించి ఆ పనుల బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించామన్నారు. విద్యాసంస్థలు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించామన్నారు.
పదేళ్లుగా పదోన్నతులకు నోచుకోని 21,419 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి నమ్మకాన్ని సృష్టించాము. 34,706 మంది ఉపాధ్యాయులను పారదర్శకంగా బదిలీ చేసి సుదీర్ఘకాలంగా ఉన్నఉపాధ్యాయులసమస్యలు పరిష్కరించామని బట్టి విక్రమార్క తెలిపారు.
ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన ప్రకటించగానే అంతఆశ్చర్యపోయారని,ఒక ఏడాదిలోనే ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తాం అంటే సాధ్యం అయ్యే పనేనా అంటూ నవ్వుకున్నారని పేర్కొన్న ఆయన, గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఈ రంగానికి కేటాయించింది కేవలం 73 కోట్లు మాత్రమే అన్నారు
చిత్తశుద్ధి, సంకల్ప బలంతో చేసే పని మంచిదైతే సాధ్యం కానిది లేదని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం నిరూపించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 30 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి పూజ చేశామ్యాన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ లో, డిప్యూటీ సీఎం గా తాను గోవిందాపురంలో, రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఏకకాలంలో భూమి పూజలు చేశారన్నారు. ఏడాది మొత్తంగా శంకుస్థాపనలు చేయకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో శంకుస్థాపనలు చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారం, అసమానతలు లేని సమాజ నిర్మాణానికి విద్య ప్రధానమని, అందుకే కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నామన్నారు.
స్థల సేకరణ, వాతావరణం, అన్ని అంశాలను సాంకేతిక పద్ధతుల్లో అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించిన తర్వాతే భూమి పూజలు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో పదేళ్లు పాలన సాగించినపార్టీ ఇతర ప్రతిపక్షాల ఉడత ఊపుల విమర్శలకు అభివృద్ధి కార్యక్రమాలు అపమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని, జవాబుదారి తనo తో పారదర్శకతతో కూడిన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
సభా కార్యక్రమంలో వేదిక మీదికి సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ పార్టీల నాయకులను బట్టి విక్రమార్క ఆహ్వానించి వారితో మాట్లాడించడం, రాజకీయాలు ఎన్నికల వరకే నని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతిపక్షాలు తమ అమూల్యమైన సూచనలను చేయాలని కోరడం జరిగింది. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త ఒరవడికి నాంది పలికేలా ఉన్నదని ఆయా పార్టీల నాయకులు పేర్కొనడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహయం రఘురామిరెడ్డి, వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యం, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు , డిసిసి అధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రజా ప్రతినిధులు, సిపిఎం రాష్ట్ర బాధ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ముత్తారపు వెంకటిలతో పాటు పలు శాఖల అధికారులు ఉన్నారు.