చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య కామారెడ్డి : 'డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ' అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు. భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం దసరా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు విఘ్నేశ్‌(6), అనిరుధ్‌రెడ్డి(4)కి కొత్త …

చిన్నారులను బావిలోకి తోసి తండ్రి ఆత్మహత్య

కామారెడ్డి : 'డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు పిల్లలను లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా.. ' అని బెదిరించిన ఆ కసాయి అన్నంత పని చేశాడు.

భార్య, అత్తింటి వారిపై కోపం పెంచుకుని కన్న బిడ్డలను బావిలో తోసేసి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో మండలంలోని నందివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శనివారం దసరా సందర్భంగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి(30) తన ఇద్దరు కొడుకులు విఘ్నేశ్‌(6), అనిరుధ్‌రెడ్డి(4)కి కొత్త డ్రెస్‌లు వేయించి తన బైక్‌పై శమీ పూజకు తీసుకెళ్లాడు. అతడి భార్య అపర్ణ ఇంటి వద్దే ఉన్నది.

రాత్రయినా వారు తిరిగిరాకపోయేసరికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌, చెప్పులు కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

బావిలో నుంచి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. మోటార్లు వేసి నీటిని ఖాళీ చేయడంతో బావిలో శ్రీనివాస్‌ రెడ్డి మృతదేహం లభించింది. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన కొడుకులు, భర్త మృతదేహాన్ని చూసి అపర్ణ రోదన మిన్నంటింది.

తన బిడ్డల మృతదేహాలను గుండెలకు హత్తుకుని ఆమె రోదించడం అక్కడి వారిని కంటతడిపెట్టించింది. శరన్నవరాత్రుల సందర్భంగా చిన్నారులు విఘ్నేశ్‌, అనిరుధ్‌రెడ్డి ప్రతి రోజూ అమ్మవారి మండపానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారని గ్రామస్తులు రోదిస్తూ తెలిపారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా నాయ్‌గావ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి పదేళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.

Updated On 15 Oct 2024 9:06 AM IST
cknews1122

cknews1122

Next Story