వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
ఏసీబీ వలలో చిక్కిన మున్సిపల్ కమిషనర్ ఆధిశేషు
పెబ్బేరు అక్టోబర్22 (సి కే న్యూస్)
ఉన్నతహోదాలోని కొందరు ఉద్యోగులు వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండలేకపోతున్నారు. డబ్బులిస్తేనే ఫైల్స్‌కు మోక్షం కలుగుతుందని ఖరాకండిగా చెబుతున్నారు. అడిగినంత ఇస్తేనే పనులు పూర్తి అవుతాయని మొండికేస్తున్నారు.
ప్రభుత్వం వేలకు వేలు జీతాలు ఇస్తున్న మున్సిపల్ అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తిపడి పట్టణ ప్రజలను రోజుల తరబడి తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు.
వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ను మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ పట్టుకున్నారు.
ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ…గత ఏడాది ఒక కాంట్రాక్టర్ చేసిన పనులకు రూ.2.6 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బిల్లుల చెల్లింపు కోసం రూ.25 వేలు లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్ రిక్వెస్ట్ మేరకు రూ.20వేలు అంగీకరించారు.దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.
*లంచం తీసుకుంటుండగా దాడి
ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును పట్టుకున్నామని అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు.ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా,తాము నోట్లు ఇచ్చామని, అవే నోట్లను కమిషనర్ కాంట్రాక్టర్ ఇచ్చారన్నారు.
కాంట్రాక్టర్ లంచం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత తాము వెళ్లి పట్టుకున్నామని చెప్పారు.తనతో పాటు పది మంది సిబ్బంది ఉన్నారన్నారు.ఇంకా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.
నేడు నాంపల్లి కోర్టులో హాజరు
లంచం తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును విచారణ అనంతరం అరెస్టు చేసిన నాంపల్లిలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు.ప్రస్తుతానికి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని, రికార్డులు కూడా తనిఖీ చేస్తున్నామని చెప్పారు.
అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు లంచం అడిగినట్లు మా దృష్టికి తీసుకురావడంతో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేస్తే వెంటనే దాడులు చేస్తామని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
అవినీతి అధికారుల జాబితా సిద్ధం…
మండలంలోని వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవినీతి అధికారుల జాబితాను ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.
తమ పేర్లు ఏసీబీ అధికారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో అని తెలిసిన వ్యక్తులతో సమాచారం తెలుసుకునేందుకు అవినీతి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.