రైస్ మిల్లులో తాళ్ పేరుతో ధాన్యంలో కోతలు పెడితే చర్యలు తప్పవు...
వరి ధాన్యం కేటాయింపుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి…… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రైస్ మిల్లులో తాళ్ పేరుతో ధాన్యంలో కోతలు పెట్టవద్దు రైస్ మిల్లర్ల ధాన్యం కేటాయింపుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, అక్టోబర్ -30: జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో …
వరి ధాన్యం కేటాయింపుకు బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి……
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
రైస్ మిల్లులో తాళ్ పేరుతో ధాన్యంలో కోతలు పెట్టవద్దు
రైస్ మిల్లర్ల ధాన్యం కేటాయింపుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, అక్టోబర్ -30:
జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీపై మిల్లర్లతో, బ్యాంక్ అధికారులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మిల్లులకు సరఫరా చేసే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరి అని అన్నారు. పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎటువంటి అవకతవకలకు తావివ్వకుండా రైస్ మిల్లులకు బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు చేయడం జరుగుతుందని ప్రభుత్వం పాలసీ నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి బకాయిల చరిత్ర లేని మిల్లర్లు, మిల్లింగ్ సామర్థ్యంపై 10 శాతం బ్యాంకు గ్యారంటీ/ 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్, గతంలో బకాయిలు ఉండి సకాలంలో పెనాల్టీతో సహా చెల్లించిన మిల్లర్లు 20 శాతం బ్యాంకు గ్యారంటీ/25 శాతం సెక్యూరిటీ డిపాజిట్, వంద శాతం బకాయిలు చెల్లించి 25 శాతం పెనాల్టీతో డిఫాల్ట్ ఉన్న మిల్లర్లు 25 శాతం బ్యాంకు గ్యారంటీ/ 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చూపెట్టాల్సి ఉంటుందని అన్నారు.
రైస్ మిల్లులకు ధాన్యం మొత్తం కేటాయింపుల ప్రకారం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శుభ్రం చేయకుండా కొనుగోలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశామని, మిల్లుల వద్ద తాళ్ పేరుతో ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని కలెక్టర్ తెలిపారు.
రైస్ మిల్లుల వద్ద హామాలీల కొరత లేకుండా చూసుకోవాలని అన్నారు. నాణ్యమైన ధాన్యానికి కూడా కోతలు విధించాలని ప్రయత్నిస్తే మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో అధికంగా ధాన్యం కొనుగోలు కూడా లేదని, మనపై అధికంగా ఒత్తిడి లేకపోయినా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని అన్నారు.
ఖమ్మం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి గోడౌన్ స్పెస్ ఉన్నందున, ముందుగా ఖమ్మం జిల్లా స్పెస్, ఎఫ్.సి.ఐ. అలాట్మెంట్ జరిగేలా చూడాలని అన్నారు.
మిల్లుల వద్ద ఉన్న గన్ని బ్యాగులు కొనుగోలు కేంద్రాలకు త్వరగా అందజేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాలకు దగ్గర్లోని రైస్ మిల్లులకు ధాన్యం ట్యాగింగ్ చేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎప్పుడు, ఎంత వస్తుందో ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వర రావు, మిల్లర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.