ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలి……
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
వైద్య శాఖ ప్రజలకు సేవా దృక్పథంతో పని చేయాలి
విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలి
ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలి
ప్రతి ఆసుపత్రి వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి
వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై సమీక్షించిన జిల్లా కలెక్టర్
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం :
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలలో విశ్వాసం కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య శాఖ సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సమావేశం నిర్వహించారు.
సివిల్ ఇన్ ఫ్రా, వైద్య శాఖ సిబ్బంది హాజరు నమోదు, వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ నియామకాల ప్రక్రియ, డ్రగ్స్ (మందుల) నిల్వల సద్వినియోగం, ఆసుపత్రుల నిధుల వినియోగం మొదలగు వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన, స్పందించే విధానం చాలా దారుణంగా ఉందని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే స్పృహ లేకపోతే పని చేయవద్దని అన్నారు.
పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం, సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమని, ఇది లేకుండా ఎంత మౌళిక వసతులు కల్పించినా ప్రజలలో విశ్వాసం కల్పించలేమని అన్నారు.
జిల్లాలోని పి.హెచ్.సి, సబ్ సెంటర్, జనరల్ ఆసుపత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, ఎం.సి.హెచ్ లలో పని చేసే వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది బయో మెట్రిక్ అటెండెన్స్ విధానం పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీలు లేదని, ఆసుపత్రి సిబ్బంది సకాలంలో హాజరు కావాలని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అనుమతి లేకుండా తీసుకున్న సెలవులకు జీతం కట్ చేయాలని అయినప్పటికీ పద్దతి మార్చుకోకపోతే మెడికల్ కౌన్సిల్ కు రాయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, ఆప్తామాలజిస్ట్, డెంటిస్ట్, పిడియాట్రీషియన్, ఈ.ఎన్.టి, గైనిక్, డర్మటాలజీ విభాగాలలో వైద్యుల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.
ప్రతిరోజు ఆసుపత్రికి వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, డ్యూటీ వదిలి ఎప్పుడు వెళ్తున్నారు, వంటి వివరాలు బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
రాబోయే వారం రోజులలో ప్రతి ఆసుపత్రిలోని ఫార్మసి వద్ద అందుబాటులో ఉన్న మందుల వివరాలు ప్రదర్శించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా మందుల కొరత ఉండటానికి వీల్లేదని అన్నారు.
ఆసుపత్రులలో వైద్యుల రూమ్ వద్ద ఆ డాక్టర్ రౌండ్ లకు ఎప్పుడు వెళ్తారో టైమింగ్ రాసి పెట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆసుపత్రి దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, దీనికి ఆరోగ్య మిత్ర సేవలు వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మంలో నియోజకవర్గాల వారీగా ఆసుపత్రిలో మౌళిక వసతుల కల్పన క్రింద మొత్తం 23 పనులు మంజూరు కాగా 2 పూర్తి చేశామని, 15 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 4 ఎస్.టి.పి. ల నిర్మాణం పనులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత షెడ్యూల్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని జనరల్ ఆసుపత్రి, ఎం.సి.హెచ్. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని, ఆసుపత్రిలో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, వాటి ఔట్ లెట్ ఎంత మొదలగు వివరాలు పరిశీలిస్తూ ఎఫ్.ఎస్.టి.పి. నిర్మాణం జరగాలని అన్నారు.
ఎం.సి.హెచ్. టాయిలెట్ల రెనోవేషన్ పనులు పురోగతి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. సబ్ సబ్ సెంటర్ ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులను డిఎంఎఫ్టీ నుంచి మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు వెంటనే రెండు లక్షల చొప్పున నిధులు కేటాయించడం జరుగుతుందని, అత్యవసరమైన పనులకు, అవసరమైన సామాగ్రి కొనుగోలుకు వినియోగించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో ఖమ్మం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. రాజేశ్వర్ రావు, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి. సుబ్బారావు, డిసిహెచ్ఎస్ సూపరింటెండెంట్ డా. కె. రాజశేఖర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.