ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
మెదక్ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.తనను ప్రేమించడం లేదని యువతిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన యువతి ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చింది.
మెదక్ పక్కనే ఉన్న అవుసులపల్లి గ్రామంలో బంధువుల వద్ద ఉంటూ పరీక్షలు రాస్తోంది. అయితే, కొన్నాళ్ల నుంచి ఆమెను బెంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు వెళ్తున్న యువతి వద్దకు వెళ్లిన చేతన్ ఆమెతో గొడవపడ్డాడు.
యువతి చేతిలో మొబైల్ను పగలగొట్టి అనంతరం తన వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో యువతి చేతికి తీవ్ర గాయం కాగా.. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న మెదక్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు చేతన్ అలియాస్ కిరణ్ అని అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.