మున్నాల ముచ్చటైన టీచర్ ఉద్యోగం
హిందీ పండిట్లను తొలగించిన అధికారులు
సి కె న్యూస్ ప్రతినిధి
ఖమ్మంలో కొత్తగా రిక్రూట్ అయిన హిందీ పండిట్ల తొలగింపు.. అదీ 24 రోజులు డ్యూటీ చేశాక..
ఖమ్మం జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన హిందీ పండిట్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది. 24 రోజులు డ్యూటీ చేశాక తొలగించారని హిందీ పండిట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
స్క్రూటినీలో అధికారుల నిర్లక్ష్యంతో తప్పు జరిగిందని ఖమ్మం డీఈవో తెలిపారు. అర్హులకు అన్యాయం జరగొద్దనే వీళ్లను తొలగించామని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఖమ్మం డీఈవో సోమశేఖర శర్మ పేర్కొన్నారు. హిందీ ప్రవీణ, భూషణ్, విశారద సర్టిఫికెట్లు పనికిరావని ఖమ్మం డీఈవో చెప్పారు.
ఇదిలా ఉండగా.. అధికారుల తీరుపై హిందీ పండిట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ పండిట్ల సర్టిఫికెట్లు చెల్లవని ఇప్పుడు తొలగించారని, స్క్రూటినీలోనే సర్టిఫికెట్లు చెల్లవని ఎందుకు చెప్పలేదని బాధితులు నిలదీశారు. ఉద్యోగాలు వచ్చిన ప్రాంతాలకు కుటుంబాలను తీసుకెళ్లామని, ఉద్యోగాలు ఇచ్చి తొలగించడం భావ్యం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు అపాయింట్మెంట్లు.. ఇప్పుడు టెర్మినేట్ లెటర్లు ఇచ్చారని బాధిత హిందీ పండిట్లు లబోదిబోమంటున్నారు.