బాధలు మావి… వసూళ్లు వాళ్ళవి
— చందా పేరుతో పదిలక్షల వసూళ్లు
— డబ్బులు అడిగినందుకు గెంటివేత
— పోలీసులను ఆశ్రయించిన దక్కని ఫలితం
— విలేకరుల సమావేశంలో గోడు వెల్లబోసుకున్న బాధితులు
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం, నవంబర్ 9 : కరెంటు షాక్ తో 70% కాలిపోయిన శరీరంతో ఉన్న కొడుకును కాపాడుకునేందుకు కన్నీరు మున్నీరవుతూ తల్లిదండ్రులు హుటా హుటిన ఖమ్మం, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం, కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం హైదరాబాదు వెళ్లి రెండు మూడు నెలలుగా ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ కొడుకు ప్రాణాలు దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఒకటైతే.. చందాల పేరుతో వాళ్ళ కొడుకు ఫోటో పెట్టి కొందరు పది లక్షల వరకు వసూళ్ళు చేసుకున్న వైనం మరొకటి.
ఆ విషయం తెలిసి అడిగినందుకు.. దిక్కున కాడ చెప్పుకో పో అని కిరాయికి ఉన్న ఇంటిలో నుండి గెంటి వేశారని పెంతల శోభ ఆవేదన వ్యక్తం చేసింది.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు.
ఖమ్మం రూరల్ మండలం, శ్రీ సాయి గణేష్ నగర్, రోడ్ నెంబర్ 14 లో శోభ తన భర్త మధు ఇద్దరు పిల్లలతో కలసి పోట్ల శ్రీనివాసరావు ఇంట్లో ఏడు వేలు అద్దె చెల్లిస్తూ గత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటూ చిన్నపాటి కిరాణం నడుకుంటున్నారు. ఈ క్రమంలో జూలై 4న డాబాపై ఆడుకుంటున్న తమ కుమారుడు భారత్ (9) కు ఇంటి పైన ఉన్న 33/11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో 70% శరీరం కాలిపోయింది.
విగత జీవిగా పడిఉన్న తమ కుమారున్ని చూసి హుటాహుటిన ఖమ్మం ఆస్పత్రికి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తీసుకువెళ్లి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ప్రాణం దక్కింది కానీ సగం కాలిపోయిన ఎడమ కాలు తీసేసారని, కుడికాలుకు కూడా శస్త్ర చికిత్స చేస్తే నడవలేని స్థితిలో ఉన్న కొడుకును అంటిపెట్టుకొని ఉంటూ సొంత ఊరు సత్యనారాయణపురం నుండి డబ్బులు కూడపెట్టుకుంటూ వైద్యం కోసం మా బాధలు మేము పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
కరెంట్ షాక్ విషయమై శ్రీ సాయిగణేష్ నగర్ లో కిరాయి కుంటున్న ఇంటి యజమాని పోట్ల శ్రీనివాసరావు, నరేందర్ రెడ్డి, రమేష్, ప్రసాద్ లు మా బాబు ఫోటో పెట్టి కరెంట్ షాక్ తగిలిన బాబుకు దాతలు సహాయం చేయాలని గ్రూపుల్లో పోస్ట్లు పెట్టి సుమారు పది లక్షల వరకు వసూళ్లు చేశారని ఆరోపించింది. దాతలు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు ఒక లక్ష, 22వేలు ఇచ్చి మిగతావి ఇవ్వకుండా పోలీస్ కేసు ఎందుకు పెట్టావని..? మిగతా డబ్బులు ఇవ్వము ఏం చేసుకుంటావో చేసుకో.. పో అని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
అంతేకాకుండా ప్రతి నెల కిరాయి కట్టుకుంటూ ఉన్న ఇంటిలో నుండి సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్లు అన్ని బయటపడేసి ఇబ్బందులకు గురిచేస్తూ భయపెడుతున్నారని ఇట్టి విషయమై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన కాలయాపనం చేస్తూ తిప్పుకుంటున్నారని వాపోయింది.
జిల్లా అధికారులు స్పందించి, విచారణ చేసి బాబు ఫోటోతో దాతలు నుండి నలుగురు వసూళ్లు చేసిన పది లక్షల సొమ్మును ఇప్పించి కొడుకు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరించి న్యాయం చేయాలని, బంగారం, నగదు, ఖరీదైన వస్తువులతో కూడిన సామాన్లు ఇంట్లో నుండి బయట పడేసిన ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని వేడుకొంది. ఈ విలేకరుల సమావేశంలో భర్త మధు, కొడుకు భరత్ లు ఉన్నారు.