మల్లారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యానికి యువతి మృతి
డాక్టర్ల నిర్లక్ష్యానికి యువతి మృతి చెందిన దారుణ ఘటన మల్లారెడ్డి ఆసుపత్రిలో జరిగింది. ఘటన ప్రకారం మాధవి అనే యువతి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ కోసం హైదరాబాద్ లోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన హస్పిటల్‌లో చేరింది.
వైద్యులు ఆపరేషన్ చేస్తున్న సమయంలో తీవ్ర రక్త స్రావం అవ్వడంతో ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీనిపై బంధువులు వైద్యులను ప్రశ్నించగా.. నిజాన్ని దాచి, ఆపరేషన్ కు సమయం పడుతుందని బుకాయించే ప్రయత్నం చేశారు.
దీంతో పేషంట్ బంధువులు నిజం చెప్పాలని వైద్యులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం కొద్ది సేపటికే ఆపరేషన్ వికటించి మహిళ మృతి చెందింది.
అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే మాధవికి తీవ్ర రక్త స్రావం అయ్యిందని, నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాధవి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యం కోసం వస్తే మృతదేహాన్ని చేతిలో పెడుతున్నారని, తమకు న్యాయం చేయాలని మల్లారెడ్డి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
దీంతో ఈ ఘటనపై స్పందించిన జిల్లా డీఎంహెచ్ఓ, వైద్య అధికారుల బృందం మల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకొని, మాధవి మృతిపై విచారిస్తున్నారు.అయితే, కవవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మల్లా రెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు దాడి చేశారు. దీంతో సూరారం పోలీస్ స్టేషన్‌లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్స కోసం ఓ యువతి మల్లారెడ్డి ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురై శనివారం ప్రాణాలు కోల్పోయింది.
దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.