హాస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు…
నేలకొండపల్లి: ప్రభుత్వ వసతి గృహం నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ అడుగుతుండడంతో ఓ యువకుడు వారిని బైక్ పై తీసుకెళ్లి పోలీసు స్టేషన్ లో అప్పగించారు. స్థానికుల కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని రాజేశ్వరపురం ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్న ఖమ్మంకు చెందిన కౌశిక్, అనాసాగారానికి చెందిన పి.సాగర్ మంగళవారం సాయంత్రం పెన్నులు తెచ్చుకుంటామని చెప్పి బయటకు వచ్చారు. ఎంత సేపటికీ వారు రాకపోవటంతో సిబ్బంది గ్రామంలో వెతుకూతూనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
అయితే, సదరు విద్యార్థులు గ్రామ శివారులో వాహనదారుల లిఫ్ట్ అడుగుతుండగా పారిపోతున్నారనే అనుమానంతో ఓ యువకుడు బైక్ పై ఎక్కించకుని ఖమ్మం పోలీస్ స్టేషన్ అప్పగించాడు. ఈ విషయాన్ని వసతి గృహ అధికారి రవూఫ్ కు సమాచారం ఇవ్వగా ఆయన సిబ్బంది, తల్లిదండ్రులతో కలిసి వెళ్లి పిల్లలను తీసుకొచ్చారు.
కాగా, హాస్టల్లో ఉండడం ఇష్టం లేక విద్యార్థులకు బయటకు వచ్చినట్లు తెలుస్తుండగా, వారి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, హాస్టల్ నుంచి పిల్లలను ఒంటరిగా బయటకు పంపించిన సిబ్బందిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.