“చల్లా” మనస్సు చల్లగా…!
- ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ….
- శుభమైనా… అశుభమైనా తనవంతు తోడ్పాటు
- 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణ ఔదార్యం
- మంత్రి పొంగులేటి స్ఫూర్తితో విస్తృతంగా సేవా కార్యక్రమాలు
- కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే డివిజన్ ను సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : అతని ఇంటి పేరుకు తగ్గట్టుగానే ఆయన మనస్సు కూడా చల్లనైనది. శుభమైనా…. అశుభమైనా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం అతనికి అలవాటు… తన అభిమాన నాయకుడు పొంగులేటే ఆయన సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి…. ఆయన మరెవరో కాదు ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంకు చెందిన చల్లా కృష్ణ.
కాంగ్రెస్ పార్టీ పై మక్కువ… పొంగులేటి స్ఫూర్తితో…
చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు మక్కువ ఎక్కువ… గడిచిన ఇరవై ఏళ్లుగా పార్టీ తరుపున జరిగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటే కృష్ణకి ఎనలేని అభిమానం. గతంలో పార్టీలు వేరు అయినప్పటికీ అతనిపై అభిమానాన్ని ప్రదర్శిస్తూనే వచ్చాడు.
ప్రస్తుతం పొంగులేటి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండటంతో ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నాడు. దానవాయిగూడెం ప్రజలకు అంతా శుభమే జరగాలనే సంకల్పంతో, ప్రజాప్రతినిధి హోదా లేకపోయినప్పటికీ సొంత ఖర్చుతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతూ తనవంతు సహాయ సహకారాలను అందిస్తున్నాడు.
శుభమైనా… అశుభమైనా తోడ్పాటు…
గడిచిన రెండేళ్లుగా 59వ డివిజన్ కు చెందిన పేద ప్రజల ఇళ్లల్లో జరిగే ఏ శుభమైనా… అశుభమైనా అతని తోడ్పాటు ఉండాల్సిదే… చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగిన కృష్ణకు స్థానిక స్థితిగతులు అంతా తెలుసు.
ఎవరైనా ఫలానా శుభకార్యక్రమం జరుపుతున్నాం రండి అన్న అని ఆహ్వానిస్తే చాలు.వారి ఇంటికి వెళ్లి అతిథ్యం స్వీకరించడంతో పాటు వారికి ఎంతో కొంత తోడ్పాటు అందించడం ఆయన అలవాటు చేసుకున్నాడు.
అనారోగ్యంతో బాధపడే వారిని పరామర్శించి ఆసుపత్రిలో చూపించుకోమని వైద్యం కోసం ఖర్చులకు, చనిపోయిన మృతుల కుటుంబాలను ఓదార్చి దశదిన ఖర్చుల నిమిత్తం ఆర్థికసాయంతో పాటు బియ్యం ఇతర నిత్యావసరాలను సాయంగా అందించడం లాంటి సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాడు. ఇతర సమస్యలతో బాధపడే వారిని అక్కున చేర్చుకుని వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడు.
వరదల్లోనూ సాయం….
గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు దానవాయిగూడెం కూడా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో డివిజన్ ప్రజల కోసం ప్రత్యేకంగా నాలుగు సెంటర్లను ఏర్పాటు చేసి మూడుపూటల అన్నపానీయాలను అందించాడు.
బురదమయంగా మారిన రోడ్లకు తన సొంత ఖర్చుతో మట్టి రోడ్లను వేయించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 59వ డివిజన్ లో గడిచిన రెండేళ్లుగా ఆయన చేస్తున్న సేవలు కోకొల్లలు, ప్రజాప్రతినిధి హెూదా లేకపోయినప్పటికీ తన సొంత ఖర్చుతో తమను అయిన వారి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభోత్సవానికి సిద్ధంగా రామాలయం, ముత్యాలమ్మ ఆలయాలు…
స్థానికంగా దేవాలయాలు ఉండాలనే సద్దుదేశ్యంతో ప్రత్యేక చొరవ తీసుకుని ఆలయ కమిటీలను ఏర్పాటు చేసి రామాలయం, ముత్యాలమ్మ ఆలయాలను నిర్మిస్తున్నాడు. సుమారు రూ.30లక్షలకు పైగా ఆలయ నిర్మాణాలకు ఖర్చవుతుండగా అందులో సగానికి పైగా ఇతనే ఖర్చు పెట్టి ఆ ఆలయాలను నిర్మిస్తుండటం విశేషం.
ప్రస్తుతం ఇవి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు డివిజన్ లో జరుపుకునే వినాయక చవితి, దసరా, బతుకమ్మ ఉత్సవాలకు విరాళాలు ఇచ్చి వాటిని ప్రోత్సహించడం ఇతని ఆనవాయితీ.
కార్పొరేటర్ గా గెలిపిస్తే సుందరంగా తీర్చిదిద్దుతా….
చల్లా కృష్ణ, 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
నాకు మంత్రి పొంగులేటి శీనన్న స్ఫూర్తి… ఆయన స్ఫూర్తితోనే గత రెండేళ్లుగా డివిజన్ లో విస్తృత సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. ఇక్కడి ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలన్నదే నా కోరిక.
వారి కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు చేయడానికైనా నేను సిద్ధం. రాబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇస్తే గెలిచి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తాను. ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో కెల్లా దానవాయిగూడెంను అత్యంత సుందరంగా ఉంచాలన్నదే నా తపన.